దోహా (ఖతర్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సౌరభ్ చౌదరీ రజత పతకం గెల్చుకున్నాడు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 17 ఏళ్ల షూటర్... ఫైనల్లో 244.5 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన కిమ్ సాంగ్ గుక్ 246.5 పాయిం ట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. జావేద్ (ఇరాన్–221.8 పాయింట్లు) కాంస్యం సాధించాడు. మరోవైపు ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్లు ధనుశ్ శ్రీకాంత్, ఆయుష్ రుద్రరాజు పసిడి పతకాలతో మెరిశారు. భారత షూటింగ్ జట్టులో ఎంపికైన తొలి బధిర షూటర్‌గా గుర్తింపు పొందిన 16 ఏళ్ల ధనుశ్... శ్రేయ అగర్వాల్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచాడు. ఫైనల్లో ధనుశ్–శ్రేయ ద్వయం 16–14తో వాంగ్ జెరు–జియాంగ్ జువాన్‌లె (చైనా) జంటపై గెలిచింది. జూనియర్ పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్‌లో ఆయుష్ రుద్రరాజు, గుర్‌నిహాల్ సింగ్ గర్చా, అభయ్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 343 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో గుర్‌నిహాల్ రజత పతకాన్ని సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment