గువాహటి: తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ పేసర్ల ధాటికి విలవిలలాడిన అస్సాం బ్యాట్స్‌మెన్ ఫాలోఆన్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పట్టుదలతో పోరాడుతున్నారు. దాంతో ఈ రెండు జట్ల మధ్య గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. మూడోరోజు ఆటలో బ్యాట్స్‌మెన్ అమిత్ సిన్హా (188 బంతుల్లో 96 బ్యాటింగ్; 11 ఫోర్లు), రజాకుద్దీన్ అహ్మద్ (75; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత రీతిలో పోరాడటంతో అస్సాం 110 పరుగుల ఆధిక్యాన్ని సాధించగలిగింది. హైదరాబాద్ బౌలర్లు రోజంతా శ్రమించి ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు.
దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే హైదరాబాద్ మరో 3 వికెట్లు తీయడంతో పాటు, అస్సాం నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. ఫాలోఆన్ ఆడుతూ ఓవర్‌నైట్ స్కోరు 36/2తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన అస్సాం జట్టు ఆటముగిసే సమయానికి 98 ఓవర్లలో 7 వికెట్లకు 300 పరుగులతో నిలిచింది. 12 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రిషవ్ దాస్ (137 బంతుల్లో 57; 5 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ గోకుల్ శర్మ (28) త్వరగానే పెవిలియన్ చేరాడు.
ఈ దశలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అమిత్ మిశ్రా కీలక ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించాడు. అతనికి రజాకుద్దీన్ చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం రవికిరణ్ బౌలింగ్‌లో రజాకుద్దీన్ అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అమిత్ సిన్హాతో పాటు ప్రీతమ్ దాస్ (14 బ్యాటింగ్) ఉన్నాడు. రవికిరణ్, సుదీప్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, టి. రవితేజ, ముదస్సర్, మెహదీ హసన్ తలా వికెట్ దక్కించుకున్నారు. నేడు ఆటకు చివరిరోజు కాగా మిగతా మూడు వికెట్లను చకాచకా పడగొడితే హైదరాబాద్‌కు గెలిచే అవకాశం ఉంటుంది.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 326; అస్సాం తొలి ఇన్నింగ్స్: 136; అస్సాం రెండో ఇన్నింగ్స్: రియాన్ పరాగ్ (సి) సుమంత్ (బి) రవికిరణ్ 3; రిషవ్ దాస్ ఎల్బీడబ్ల్యూ (బి) మెహదీ హసన్ 52; శిబ్‌శంకర్ (బి) టి. రవితేజ 4; గోకుల్ శర్మ (సి) సందీప్ (బి) సుదీప్ త్యాగి 28; అమిత్ సిన్హా (బ్యాటింగ్) 96; రహమాన్ ఎల్బీడబ్ల్యూ (బి) ముదస్సర్ 0; రజత్ ఖాన్ (సి) సుమంత్ (బి) సుదీప్ 15; రజాకుద్దీన్ అహ్మద్ (బి) రవికిరణ్ 75; ప్రీతమ్ దాస్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (98 ఓవర్లలో 7 వికెట్లకు) 300.
వికెట్ల పతనం: 1–8, 2–15, 3–76, 4–108, 5–109, 6–131, 7–251.
బౌలింగ్: రవికిరణ్ 20–0–61–2, టి. రవితేజ 15–2–53–1, సుదీప్ త్యాగి 15–3–33–2, ముదస్సర్ 13–4–51–1, మెహదీ హసన్ 16–4–41–1, ఆకాశ్ భండారి 17–6–42–0, బి. సందీప్ 2–0–12–0.
Comments
Please login to add a commentAdd a comment