ధోని సేన మళ్లీ ఓడింది.. | australia beats india by 7 wickets in second one day | Sakshi
Sakshi News home page

ధోని సేన మళ్లీ ఓడింది..

Published Fri, Jan 15 2016 4:32 PM | Last Updated on Sun, Sep 3 2017 3:44 PM

ధోని సేన మళ్లీ ఓడింది..

ధోని సేన మళ్లీ ఓడింది..

వేదిక మారినా టీమిండియా తలరాత మారలేదు. మరోసారి భారీ స్కోరు సాధించిన ధోని సేనకు అదృష్టం కలిసిరాలేదు. రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో కళాత్మక ఇన్నింగ్స్ ఆడినా ఓటమి తప్పలేదు.

బ్రిస్బేన్: వేదిక మారినా టీమిండియా తలరాత మారలేదు. మరోసారి భారీ స్కోరు సాధించిన ధోని సేనకు అదృష్టం కలిసిరాలేదు. రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో కళాత్మక ఇన్నింగ్స్ ఆడినా మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం బ్రిస్బేన్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది.  టీమిండియా నిర్దేశించిన 309 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ఏ మాత్రం తడబడకుండా లక్ష్యాన్ని చేరుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు అరోన్ ఫించ్(71), షాన్ మార్ష్(71) చక్కటి ఆరంభాన్నిచ్చారు.  వీరిద్దరూ తొలి వికెట్ కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్టస్థితికి చేర్చారు.  కాగా, ఈ జోడీ 21 పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో టీమిండియా జట్టులో ఆశలు చిగురించాయి.

 

అయితే కెప్టెన్ స్టీవ్ స్మిత్(46), జార్జ్ బెయిలీ(76నాటౌట్ )లు మరోసారి ఆకట్టుకోవడంతో మ్యాచ్ మెల్లగా ఆసీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ జంట 78 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం స్మిత్ మూడో వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరుణంలో బెయిలీకి జత కలిసిన మ్యాక్ప్ వెల్ టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు కదలించాడు. ఒకపక్క మ్యాక్స్ వెల్(26 నాటౌట్) కుదురుగా ఆడితే బెయిలీ మాత్రం దూకుడును ప్రదర్శించాడు. ఫలితంగా ఆసీస్ 49.0 ఓవర్లలో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఇన్నింగ్స్ ను ముగించింది. దీంతో ఆసీస్ టోర్నీలో 2-0 ఆధిక్యం సాధించింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది.


అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఆదిలో ఓపెనర్ శిఖర్ ధవన్(6) వికెట్ ను కోల్పోయినా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆకట్టుకోవడంతో మూడొందల పైచిలుకు పరుగుల సాధ్యమైంది. విరాట్(59) హాఫ్ సెంచరీతో రాణిస్తే, రోహిత్(124; 127 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి కళాత్మక ఇన్నింగ్స్ తో శతకం నమోదు చేశాడు.  కాగా, విరాట్-రోహిత్ శర్మల జోడీ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరడం అభిమానుల్ని నిరాశపరిచింది. తొలుత విరాట్ అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ కాగా, తన కెరీర్ లో 10 వ సెంచరీ చేసి మంచి ఊపు మీద ఉన్న రోహిత్ శర్మ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉండగా బౌలర్ ఫాల్కనర్ చేతికి బంతి తగిలి రనౌట్ పెవిలియన్ చేరాడు. అయితే రోహిత్ అవుటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(11) క్రీజ్ లో ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తరువాత రహానే(89 ) హాఫ్ సెంచరీ చేయగా, మనీష్ పాండే (6), రవీంద్ర జడేజా (5), అశ్విన్(1) లు స్కోరును పెంచే యత్నంలో వెంట వెంటనే అవుటై నిరాశపరిచారు.



రోహిత్-కోహ్లిల అత్యత్తుమ భాగస్వామ్యం

గబ్బా స్టేడియంలో విరాట్ కోహ్లి-రోహిత్ శర్మల జోడి భారత్ తరుపున అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. రోహిత్ శర్మ- కోహ్లిలు రెండో వికెట్ కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ స్టేడియంలో ఏ వికెట్ కైనా భారత్  అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. ఈ క్రమంలోనే రోహిత్ సెంచరీ చేయగా, విరాట్ హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం రోహిత్ -అజింకా రహనేల జోడి మూడో వికెట్ కు 121 పరుగుల రెండో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని సాధించారు.

మరోవైపు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. రెండో వన్డేలో సెంచరీ చేసిన రోహిత్..  ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు శతకాలు చేసిన భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. గత పెర్త్ వన్డేలో భారీ సెంచరీ చేసి భారత మాజీ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ సరసన నిలిచిన రోహిత్.. ఈ తాజా సెంచరీతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదిలా ఉండగా గబ్బా స్టేడియంలో అత్యధిక స్కోరు చేసిన భారత ఓపెనర్ గా నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్ ఈ స్టేడియంలో ఓపెనర్ గా చేసిన 91 పరుగుల రికార్డును రోహిత్ సవరించాడు.  ఓవరాల్ గా  రోహిత్ కెరీర్ లో ఇది 10 వన్డే సెంచరీ కాగా, ఆస్ట్రేలియాపై ఐదో సెంచరీ. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో వరుసగా రెండో సెంచరీ చేయడంతో వీవీఎస్, గ్రేమ్ హిక్ ల సరసన రోహిత్ నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement