రికార్డు ఛేదన చేజారింది...
డేనైట్ టెస్టులో ఆసీస్ చేతిలో ఓడిన పాక్
అసద్ సూపర్ ఇన్నింగ్స్ వృథా
బ్రిస్బేన్: తొలి టెస్టులో పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 142 పరుగులకే కుప్పకూలింది. ఇంకా చెప్పాలంటే 67 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది. మరి అదే పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 450 పరుగులు చేసింది. 490 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆ 40 పరుగులు చేస్తే... టెస్టుల్లో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు నమోదు చేసేది. కానీ స్టార్క్ అద్భుత బంతి పాకిస్తాన్ ఆశలను కూల్చింది. క్రీజులో పాతుకుపోయిన సెంచరీ హీరో అసద్ షఫీక్ (207 బంతుల్లో 137; 13 ఫోర్లు, 1 సిక్స్)ను అవుట్ చేసి అతను రికార్డు విజయాన్ని దూరం చేశాడు.
దీంతో మొదటి డేనైట్ టెస్టులో ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. సోమవారం 382/8 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ పరాజయం లాంఛనమే అనిపించింది. కానీ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ షఫీక్, యాసిర్ షా (66 బంతుల్లో 33; 4 ఫోర్లు) మాత్రం ఆస్ట్రేలియాను వారిగడ్డపైనే వణికించారు. దీంతో చివరి రోజు విజయానికి చేయాల్సిన 108 పరుగుల్లో 67 పరుగులు వచ్చేశాయి. ఈ దశలో స్టార్క్ బౌలింగ్‌లో షఫీక్ అవుట్ కావడంతో పాక్ ఆశలు కోల్పోయింది.