ఇంతగా ఎప్పుడూ గర్వపడలేదు | Australia series win my biggest achievement: Virat Kohli | Sakshi
Sakshi News home page

ఇంతగా ఎప్పుడూ గర్వపడలేదు

Published Tue, Jan 8 2019 12:46 AM | Last Updated on Tue, Jan 8 2019 5:13 AM

Australia series win my biggest achievement: Virat Kohli - Sakshi

ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించిన కోహ్లి ఆస్ట్రేలియాపై గెలుపు తర్వాత కొత్తగా కనిపించాడు. సిరీస్‌ విజయం ఇచ్చిన అమితానందంతో అతను ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. సిడ్నీ టెస్టు తర్వాత భావోద్వేగభరితమైన అతను పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు.  

‘నా కెరీర్‌లో ఇదే అతి పెద్ద ఘనత. అన్నింటికంటే అగ్రస్థానం ఇదే విజయానికి ఇస్తాను. 2011లో ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో నేను జూనియర్‌ సభ్యుడిని. అంతకుముందు వరల్డ్‌కప్‌ గెలవలేకపోయిన బాధ ఏమీ లేదు కాబట్టి విజయం తర్వాత కూడా కొందరు సీనియర్లలా నేను భావోద్వేగానికి గురి కాలేదు. అది మంచి విజయమే అయినా ఇక్కడ నేను చాలా భావోద్వేగానికి లోనవుతున్నాను. వరుసగా మూడోసారి పర్యటించాను కాబట్టి ఇక్కడ గెలుపు ఎంత ప్రత్యేకమో చెప్పగలను. ఈ సిరీస్‌ విజయం భారత జట్టును కొత్తగా చూపిస్తుంది. జట్టులో సభ్యుడిగా నేనెప్పుడూ ఇంతగా గర్వపడలేదు. ఇలాంటి టీమ్‌ను నడిపించడం గౌరవంగా భావిస్తున్నా. నాలుగేళ్ల క్రితం ఇక్కడే తొలిసారి కెప్టెనయ్యాను. ఇప్పుడు ఇక్కడే సిరీస్‌ గెలవడం మధురానుభూతి. గత 12 నెలలుగా మేం పడిన కష్టానికి ఇది ప్రతిఫలం.’ 

‘సాంప్రదాయ శైలిలో టెస్టు క్రికెట్‌ మూలాలకు కట్టుబడి బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. అద్భుతంగా ఆడిన పుజారాను ప్రత్యేకంగా ప్రశంసించాలి. మయాంక్‌ చాంపియన్‌లా ఆడాడు. బ్యాట్స్‌మెన్‌ అంతా తమ వంతు పాత్ర పోషించారు. నా దృష్టిలో మెల్‌బోర్న్‌లో ఓపెనర్‌గా హనుమ విహారి దాదాపు 70 బంతులు ఆడటం కూడా సెంచరీతో సమానం. మన బౌలర్లు ఇంతగా ఆటను శాసించిన తీరును గతంలో ఎప్పుడూ చూడలేదు. వారి సన్నద్ధత, ఫిట్‌నెస్, ఆలోచనా ధోరణి అన్నీ గొప్పగా ఉన్నాయి. వారు పిచ్‌ను చూసి మాకు అనుకూలిస్తుందా అని ఎప్పుడూ ఆలోచించలేదు. జట్టు కోసం ఏదైనా చేసేందుకు వారు సిద్ధమయ్యారు. ఇది ఇంకా ఆరంభం మాత్రమే.’ 

‘దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో కూడా మమ్మల్ని మేం నమ్మాం. అక్కడి పరాజయాలు మేం తప్పులు దిద్దుకునేలా చేశాయి. మనం సరైన దిశలో పని చేస్తే దేవుడు కూడా సహకరిస్తాడు. ఒక టెస్టులో గెలిస్తే చాలదని, సిరీస్‌ నెగ్గాలని మేం భావించాం కాబట్టి ఈ గెలుపు ఎంతో ప్రత్యేకం. మేం ఏదైనా చేయగలమని ఈ జట్టు నిరూపించింది. ఈ విజయం తర్వాతి తరం టెస్టులపై ఆసక్తి కనబర్చేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నా. వేడుకలు జరుపుకునే అర్హత మాకుంది. ఇవి సుదీర్ఘంగా సాగుతాయని మాత్రం చెప్పగలను. అభిమానులు కూడా అండగా నిలిచారు. విదేశీ గడ్డపై ఆడుతున్నట్లుగా అనిపించనే లేదు.’ 

►1 కెరీర్‌లో తొలిసారి పుజారా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు గెల్చుకున్నాడు.  

►3 దక్షిణాఫ్రికాలోనూ భారత్‌ గెలిస్తే... తొమ్మిది వేర్వేరు దేశాలపై వారి గడ్డపైనే టెస్టు సిరీస్‌లు గెలిచిన ఆస్ట్రేలియా, 
దక్షిణాఫ్రికా సరసన చేరుతుంది.  

► 4 కోహ్లి  సారథ్యంలో భారత జట్టు విదేశాల్లో నాలుగో సిరీస్‌ నెగ్గింది. తాజా విజయంతో సౌరవ్‌ గంగూలీ (4 సిరీస్‌లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశాడు.  

​​​​​​​► 5 ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ విజయాలు సాధించిన జట్ల సంఖ్య. ఇంగ్లండ్‌ (13 సార్లు), వెస్టిండీస్‌ (4 సార్లు), 
దక్షిణాఫ్రికా (3 సార్లు), న్యూజిలాండ్, భారత్‌ (ఒక్కోసారి) ఈ ఘనత సాధించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement