
సాక్షి, బెంగళూరు: టీమిండియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్లు డెవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌లు విజృంభించారు. దీంతో ఆసీస్ భారత్‌కు 335 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్, ఫించ్‌లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలుత శతకం సాధించిన డేవిడ్ వార్నర్(124;119 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కేదర్ జాదవ్ బౌలింగ్ లో షాట్ కు యత్నించి అక్షర్ పటేల్ చిక్కాడు. దీంతో 231 పరుగుల వద్ద ఆసీస్ మొదటి వికెట్ ను నష్టపోయింది. అనంతరం అదే స్కోరు వద్ద అరోన్ ఫించ్ ను ఉమేశ్ యాదవ్ అవుట్ చేశాడు.
ఉమేశ్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చిన ఫించ్ (94; 96 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకున్నాడు. ఆపై కాసేపటికి కెప్టెన్ స్టీవ్ స్మిత్(3) మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 38 ఓవర్ తొలి బంతిని మిడ్ వికెట్ గా మీదుగా ఆడిన స్మిత్.. విరాట్ కోహ్లికి దొరికిపోయాడు. మెరుపు వేగంతో కదిలిని విరాట్ కోహ్లి అద్భుతంగా క్యాచ్ అందుకుని స్మిత్ ను పెవిలియన్ బాట పట్టించాడు. కాగా, ఇది ఉమేశ్ యాదవ్ కు వన్డేల్లో 100 వ వికెట్. దీంతో వన్డేల్లో ఉమేశ్ అరుదైన 'సెంచరీ' వికెట్ల క్లబ్‌లో చేరిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్(29), హ్యాండ్‌స్కోంబ్(43)లు దాటిగా ఆడారు. వీరని ఉమేశ్ పెవిలియన్‌కు పంపించగా.. స్టోయినీస్(19), వేడ్(3)తో భారీషాట్‌లు ఆడాడు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేశ్‌కు నాలుగు వికెట్లు, జాదవ్‌కు ఒక వికెట్ దక్కింది.