
సాక్షి, బెంగళూరు: భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో కోహ్లిసేన వరుస విజయాలకు బ్రేక్ పడింది. 335 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. చివర్లో భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. 335 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, రహానేలు మంచి శుభారంభాన్ని అందించారు. అనంతరం రహానే 53 (66 బంతులు,6 ఫోర్లు, 1 సిక్సు), రోహిత్ శర్మ65(55 బంతులు 1 ఫోర్, 5 సిక్సులు), కెప్టెన్ విరాట్ కోహ్లి(21) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. దీంతో భారత్147 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన పాండ్యా- జాదవ్‌లు జట్టును ఆదుకున్నారు. పాండ్యా తన సహజ శైలి ఆటతో సిక్సులతో విరుచుకుపడ్డారు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న పాండ్యా41(40 బంతులు,1 ఫోర్, 3 సిక్సులు)ను జంపా బోల్తా కొట్టించాడు. దీంతో నాలుగో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండేతో జాదవ్ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ దశలో 6 ఫోర్లు ఒక సిక్సుతో 54 బంతుల్లో జాదవ్ హాఫ్ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 286 వద్ద జాదవ్67 (69 బంతులు 7 ఫోర్లు, 1 సిక్సు) రిచర్డ్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు. ఆ వెంటనే పాండే (33) కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నంలో ధోని(13), అక్సర్(5) లు విఫలమయ్యారు. దీంతో ఆసీస్ విజయం సుగుమమైంది. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్ 3, కౌల్టర్ నీల్ 2, జంపా, కమిన్స్‌లకు ఒక వికెట్ దక్కింది.
వార్నర్.. ఫించ్ విజృంభణ..
టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్(124;119 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) , ఫించ్(94; 96 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) లు మంచి శుభారభాన్ని అందించారు. ఈ జంట తొలి వికెట్‌కు 231 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించింది. ఈ భారీ ఇన్నింగ్స్‌కు ట్రావిస్ హెడ్(29), హ్యాండ్‌స్కోంబ్(43)లు రాణించడంతో ఆసీస్ 331 పరుగులు చేయగలిగింది. శతక వీరుడు వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.