
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో సత్తా చాటింది. డేవిడ్ వార్నర్(166; 147 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభణకు తోడు ఉస్మాన్ ఖవాజా(89; 72 బంతుల్లో 10 ఫోర్లు), అరోన్ ఫించ్(53;51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలు సాధించడంతో ఆసీస్ 382 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ తీసుకోవడంతో ఇన్నింగ్స్‌ను అరోన్ ఫించ్, వార్నర్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడటంతో ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఈ జోడి 121 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత ఫించ్(53; 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు.
సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో రూబెల్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చిన ఫించ్ మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో వార్నర్‌కు ఉస్మాన్ ఖవాజా జత కలిశాడు. వీరు బంగ్లా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ప్రధానంగా స్టైక్ రోటేట్ చేసి మరో విలువైన భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే వార్నర్ సెంచరీ, ఖవాజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ జోడి రెండో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత వార్నర్ ఔటయ్యాడు. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చి మ్యాక్స్‌వెల్(32; 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కాగా, అనవసరపు పరుగు కోసం క్రీజ్ దాటి రావడంతో రనౌట్ అయ్యాడు. ఆపై పరుగు వ్యవధిలో ఖవాజా ఔట్ కాగా, స్టీవ్ స్మిత్(1)సైతం నిరాశపరిచాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్(17 నాటౌట్), అలెక్స్ క్యారీ(11 నాటౌట్)లు దూకుడుగా ఆడటంలో విఫలయ్యారు. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మూడు వికెట్లు సాధించగా, ముస్తాఫిజుర్ రహ్మాన్ వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment