
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ మెగా టోర్నీలో ఒక్క భారత్‌తో మినహా మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఆసీస్.. మొత్తం 12 పాయింట్లతో ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరిన తొలిజట్టుగా నిలిచింది. ఫించ్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల్లో బలీయంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. మరోవైపు టోర్నీలో అపజయమే ఎరుగకుండా సాగుతున్న కివీస్‌కు గత మ్యాచ్‌లో పాకిస్తాన్ షాకిచ్చింది.
ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న కివీస్ నాకౌట్‌లో ప్రవేశించాలంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో జరిగే మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలవాల్సి ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను పరిశీలిస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియానే ఫేవరెట్‌గా చెప్పుకోవచ్చు. రెండు జట్లు గత వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడినప్పుడు ఆసీస్ జయకేతనం ఎగురవేసింది. దాంతో ఆస్ట్రేలియాను కంగుతినిపించి గత పరాభవానికి విలియమ్సన్ సేన బదులు తీర్చుకుంటుందా.. లేక మరోసారి ఆసీస్‌దే పైచేయి అవుతుందా అన్నది చూడాలి.