డీఆర్ఎస్ వివాదంలో స్టీవ్ స్మిత్ యూటర్న్
రాంచీ: డీఆర్ఎస్ వివాదంపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ యూ టర్న్ తీసుకున్నాడు. రెండు టెస్టు బెంగళూరులో భారత పేసర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔట్ కావడంతో డీఆర్ఎస్ రివ్యూ కోరాలా వద్దా అన్న సంశయంలో ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్ నిర్ణయం కోసం చూశానని ఒప్పుకుని, క్షమాపణ చెప్పిన స్మిత్ రాంచీ టెస్టుకు ముందురోజే మాట మార్చాడు. డీఆర్ఎస్ విషయంలో తాను ఎలాంటి తప్పిదం చేయలేదని పేర్కొన్నాడు. వాస్తవానికి ఆసీస్ జట్టు మైదానంలోనే రివ్యూపై నిర్ణయాలు తీసుకుందని, డీఆర్ఎస్ లో తాము ఎక్కువగా సక్సెస్ అయినట్లు చెప్పాడు.
'టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో నేను రెండుసార్లు గమనించాను. భారత ఆటగాళ్లు డీఆర్ఎస్ కోసం వెళ్లాలా.. వద్దా అని వారి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూశారు. ఈ విషయంపై అప్పుడే అంపైర్లకు ఫిర్యాదుచేశాను. నేను ఏ విషయంపై పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదు. కోహ్లీ ఆటమీద కంటే నా మీదే దృష్టిపెట్టాడు. డీఆర్ఎస్ వివాదంలో కోహ్లీనే నిందితుడు అవుతాడు. వివాదం జరిగిన రోజు సాయంత్రం నేను తప్పును అంగీకరించాను. కానీ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి.
కోహ్లీ వ్యాఖ్యలు నాపై చేసిన విమర్శలపై అంపైర్లతో పాటు మ్యాచ్ రిఫరీ రిచర్డ్ సన్‌ను కలిశాను. కేవలం రూల్స్ తో ఆడితే అంతిమంగా క్రికెట్ గెలుస్తుంది. రేపు టెస్టు ప్రారంభానికి ముందు నేను రిఫరీ సమక్షంలో ఈ వివాదంపై కోహ్లీతో మాట్లాడతాను. వ్యక్తిగత దూషణకు దిగి కోహ్లీ చాలా తప్పు చేశాడు' అని స్మిత్ చెప్పుకొచ్చాడు. 'నేను అలా చేసి ఉండాల్సింది కాదు. అప్పుడు బుర్ర కొద్దిగా పనిచేయలేదు' అని గతంలో పేర్కొన్న స్మిత్.. మూడో టెస్టుకు ముందురోజు భారత కెప్టెన్ కోహ్లీ చర్య తాను చేసినదాని కంటే తీవ్ర తప్పిదమని వ్యాఖ్యానించాడు.