విరాట్ 'ఆట' ఏమిటో చూస్తాం!
మెల్బోర్న్: భారత్తో సిరీస్కు ముందే ఆస్ట్రేలియా మైండ్ గేమ్ మొదలెట్టేసింది. ప్రస్తుతం పాకిస్తాన్తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా..వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్ లో పర్యటనపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని టార్గెట్ చేస్తూ మాటల యుద్దానికి దిగాడు. భారత్ తో జరిగే నాలుగు టెస్టు సిరీస్లో విరాట్ 'ఆట'ను తాము చూడాలనుకుంటున్నట్లు స్మిత్ వ్యాఖ్యానించాడు.
'విరాట్ వరల్డ్ క్లాస్ ఆటగాడు. విరాట్ కోహ్లి దూకుడుతో భారత్ జట్టు గత 18 నెలలుగా తన జైత్రయాత్ర సాగిస్తోంది. భారత్లో వారు ఇప్పటికే చాలా క్రికెట్ ఆడారు. ఆ క్రమంలోనే విరాట్ బాడీ లాంగ్వేజ్ కూడా బాగా మెరుగుపడి ఉంటుంది. విరాట్ ను తొందరగా పెవిలియన్ కు పంపడమే మా లక్ష్యం. మాపై విరాట్ ఎంతవరకూ రాణిస్తాడో చూస్తాం. మాతో సిరీస్ లో విరాట్ సహనాన్ని పరీక్షిస్తాం' అని స్మిత్ వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విదేశీ పర్యటనకు వెళ్లే ముందు మాటల యుద్ధానికి దిగడం కొత్తేమీ కాదు. ప్రత్యర్థి ఆటగాళ్లను మాటలతో బలహీనపరిచి మానసికంగా పైచేయి సాధించడం ఆసీస్ గేమ్ ప్లాన్లో భాగం. దీనిలో భాగంగా విరాట్ సేన పై స్మిత్ మైండ్ గేమ్ ను ఆరంభించాడని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్లో విరాట్ ను కట్టడి చేసి భారత్ పై పైచేయి సాధించాలని ఆసీస్ ముందుగానే ప్రణాళిక రచిస్తోంది.