
భళా... నా లీ
సంచలనాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన స్లొవేకియా ‘పాకెట్ రాకెట్’ డొమినికా సిబుల్కోవా జోరుకు కళ్లెం వేస్తూ చైనా స్టార్ నా లీ తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది.
విధి లిఖితం అంటే ఇదేనేమో... మూడో రౌండ్‌లోనే ఓటమి అంచుల్లోకి వెళ్లి మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్న క్రీడాకారిణి టైటిల్ గెలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ చైనా స్టార్ నా లీ ఖాతాలో చేరింది. రెండుసార్లు ఫైనల్లో ఓడిపోయిన వేదికైపై మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. ఈ క్రమంలో పెద్ద వయస్సులో (31 ఏళ్ల 11 నెలలు) ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగానూ గుర్తింపు పొందింది.
మెల్‌బోర్న్: సంచలనాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన స్లొవేకియా ‘పాకెట్ రాకెట్’ డొమినికా సిబుల్కోవా జోరుకు కళ్లెం వేస్తూ చైనా స్టార్ నా లీ తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. మూడో ప్రయత్నంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. 97 నిమిషాలపాటు శనివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ నా లీ 7-6 (7/3), 6-0తో 20వ సీడ్ సిబుల్కోవాను ఓడించింది.
2011 ఫైనల్లో క్లియ్‌స్టర్స్ (బెల్జియం), 2013 ఫైనల్లో అజరెంకా (బెలారస్) చేతిలో ఓడిన నా లీ ఈసారి మాత్రం విజేతగా నిలిచింది. 70 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను రెండుసార్లు చేజార్చుకున్నారు. కీలకమైన టైబ్రేక్‌లో నా లీ పైచేయి సాధించింది. ఈ సెట్ నెగ్గిన ఉత్సాహంతో రెండో సెట్‌లో నా లీ చెలరేగింది. సిబుల్కోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా 6-0తో సెట్‌ను నెగ్గడంతోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది.
ఈ విజయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను పెద్ద వయస్సులో నెగ్గిన క్రీడాకారిణిగా నా లీ గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు ఈ రికార్డు మార్గరెట్ కోర్ట్ (30 ఏళ్ల వయస్సులో, 1973లో టైటిల్) పేరిట ఉండేది. నా లీ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2011లో ఆమె ఫ్రెంచ్ ఓపెన్ సాధించింది.
విశేషాలు
30 ఏళ్లు పైబడ్డాక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించిన ఏడో క్రీడాకారిణిగా నా లీ నిలిచింది. గతంలో మార్టినా నవ్రతిలోవా, బిల్లీ జీన్ కింగ్, క్రిస్ ఎవర్ట్, వర్జినియా వేడ్, మార్గరెట్ కోర్ట్, సెరెనా విలియమ్స్ ఈ ఘనత సాధించారు.
ఓపెన్ శకంలో మ్యాచ్ పాయింట్ కాచుకొని ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన నాలుగో క్రీడాకారిణి నా లీ. గతంలో మోనికా సెలెస్, కాప్రియాటి, సెరెనా విలియమ్స్ ఈ ఘనత సాధించారు.
విజేతగా నిలిచిన నా లీకి 26 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 14 కోట్ల 44 లక్షల 41 వేలు)... రన్నరప్ సిబుల్కోవాకు 13 లక్షల 25 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 7 కోట్ల 22 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఈ విజయంతో నా లీ సోమవారం విడుదల చేసే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంటుంది. రెండో స్థానంలో ఉన్న అజరెంకాకు, నా లీకి కేవలం 11 పాయింట్లు తేడా ఉంది.
ఫైనల్లో నా లీ రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు 13 సార్లు దూసుకొచ్చి 8 సార్లు పాయింట్లు నెగ్గింది. 10 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఐదింటిని సద్వినియోగం చేసుకుంది. 34 విన్నర్స్ కొట్టిన నా లీ 30 తప్పిదాలు చేసింది.
నాదల్Xవావ్రింకా
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్
పురుషుల సింగిల్స్ ఫైనల్ నేడు'
నాదల్ x వావ్రింకా
ముఖాముఖి: నాదల్ 12-0తో పైచేయి
మధ్యాహ్నం గం. 2.00 నుంచి
మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్
సానియా మీర్జా-హొరియా టెకావ్ గీ క్రిస్టినా-నెస్టర్
ఉదయం గం. 10.30 నుంచి