ఫెడరర్ 13వసారి...
మెల్‌బోర్న్: తన కెరీర్‌లో ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ ఏడాదీ రోజర్ ఫెడరర్ దూసుకెళ్తున్నాడు. పూర్వ వైభవం కోసం తపిస్తున్న ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా 13వ ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 2004 నుంచి ప్రతి ఏడాదీ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో కనీసం సెమీఫైనల్‌కు చేరుకున్న ఈ మాజీ నంబర్‌వన్‌కు నాలుగో రౌండ్ నుంచి అసలు పరీక్ష ఎదురుకానుంది.
పదేళ్ల తర్వాత గతేడాది ఫెడరర్ తొలిసారి ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. ఈ ఏడాది అలాంటి చేదు ఫలితాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో స్వీడన్ మాజీ స్టార్ స్టీఫెన్ ఎడ్బర్గ్‌ను తన కోచ్‌ల బృందంలో నియమించుకున్నాడు.
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెడరర్ ఆటతీరు పరిశీలిస్తుంటే ఈ నియామకం మంచి ఫలితాన్ని ఇచ్చినట్టే కనిపిస్తోంది. తొలి రెండు రౌండ్లలో అలవోకగా నెగ్గిన ఈ మాజీ నంబర్‌వన్ అదే జోరును కొనసాగిస్తూ మూడో రౌండ్‌లోనూ విజృంభించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో ఆరో సీడ్ ఫెడరర్ 6-2, 6-2, 6-3తో తెమురాజ్ గబాష్‌విలి (రష్యా)పై గెలిచి ఈ టోర్నీలో వరుసగా 13వ ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 32 ఏళ్ల ఫెడరర్ అర డజను ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు.
మూడు రౌండ్లలో అంతగా ప్రతిఘటన ఎదుర్కోని ఫెడరర్‌కు ఇక నుంచి ప్రతి మ్యాచ్ అగ్నిపరీక్షే కానుంది. సోమవారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో అతను పదో సీడ్ సోంగా (ఫ్రాన్స్)తో తలపడతాడు. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సోంగాను ఓడించిన ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో మాత్రం అతని చేతిలోనే ఓటమి చవిచూశాడు. ఒకవేళ సోంగాను ఓడించినా ఫెడరర్‌కు క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) రూపంలో మరో మేటి ప్రత్యర్థి ఎదురుపడే అవకాశముంది. ముర్రేను అధిగమిస్తే ఫెడరర్‌కు సెమీఫైనల్లో మాజీ చాంపియన్ నాదల్ ఎదురయ్యే అవకాశముంది.
నాదల్ హడల్...
గతేడాది గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగని టాప్ సీడ్ రాఫెల్ నాదల్ ఈసారి తన దూకుడు కొనసాగిస్తున్నాడు. 25వ సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మూడో రౌండ్‌లో నాదల్ 6-1, 6-2, 6-3తో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశాడు. రెండు గంటల నాలుగు నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో నాదల్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. మోన్‌ఫిల్స్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన నాదల్ నెట్‌వద్దకు 13సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు సాధించాడు. మరోవైపు 11వ సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా)కు చుక్కెదురైంది. మూడో రౌండ్‌లో 22వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6-3, 3-6, 6-4, 7-6 (12/10)తో రావ్‌నిక్‌ను బోల్తా కొట్టించాడు.
వొజ్నియాకికి నిరాశ...
మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) మూడో రౌండ్‌లోనే నిష్ర్కమించింది. గార్బిన్ ముగురుజా (స్పెయిన్) 4-6, 7-5, 6-3తో పదో సీడ్ వొజ్నియాకిని ఇంటిదారి పట్టించింది. 2009 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వొజ్నియాకి మూడో రౌండ్‌లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి.
పురుషుల సింగిల్స్ ఫలితాలు
నాలుగో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 7-6 (7/2), 6-4, 6-2తో 26వ సీడ్ ఫెలిసియానో
లోపెజ్ (స్పెయిన్)పై...
పదో సీడ్ సోంగా (ఫ్రాన్స్) 7-6 (7/5),6-4, 6-2తో 18వ సీడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై...
16వ సీడ్ నిషికోరి (జపాన్) 7-5, 6-1, 6-0తో డొనాల్డ్ యంగ్ (అమెరికా)పై గెలిచారు.
మహిళల సింగిల్స్ 3వ రౌండ్ ఫలితాలు
రెండో సీడ్ అజరెంకా (బెలారస్) 6-1, 6-0తో మ్యూస్‌బర్గర్ (ఆస్ట్రియా)పై...
మూడో సీడ్ షరపోవా (రష్యా) 6-1, 7-6 (8/6)తో 25వ సీడ్ అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై...
ఐదో సీడ్ రద్వాన్‌స్కా (పోలండ్) 5-7, 6-2, 6-2తో 29వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా)పై...
ఎనిమిదో సీడ్ జంకోవిచ్ (సెర్బియా) 6-4, 7-5తో కురుమి నారా (జపాన్)పై గెలిచారు.
ప్రిక్వార్టర్స్ చేరిన స్విస్ స్టార్
ఇక అసలు పరీక్ష షురూ
ఆస్ట్రేలియన్ ఓపెన్
2009లో నా భార్య మిర్కా గర్భవతిగా ఉన్నపుడు నేను అద్భుతంగా ఆడాను. ఆ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ గెలిచాను. ఆమె మళ్లీ గర్భవతిగా ఉంది. ఈసారీ అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.
-ఫెడరర్