పాక్ క్రికెటర్ అరుదైన ఫీట్
దుబాయ్: పాకిస్తాన్ తమ టెస్టు చరిత్రలో 400వ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ ప్లేయర్ అజహర్ అలీ అరుదైన రికార్డును నమోదుచేశాడు. కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న అజహర్ అలీ డబుల్ సెంచరీ(208 నాటౌట్: 19 ఫోర్లు, 1 సిక్సర్) సాధించాడు. దీంతో డే అండ్ నైట్ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్ నెలకొల్పాడు. నిన్న (గురువారం) తొలి సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన అజహర్ అలీ.. తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు. ఇన్నింగ్స్ 121 ఓవర్లో విండీస్ బౌలర్ గాబ్రియెల్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి డబుల్ సెంచరీ మార్కును చేరుకున్నాడు.
24 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ చేసిన పాక్ ఓపెనర్ గా అజహర్ అలీ నిలిచాడు. 1992లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో పాక్ ఓపెనర్ ఆమర్ సోహైల్ ద్విశతకం చేశాడు. సమీ అస్లామ్(90), అసద్ షఫీఖ్(67) రాణించారు. డబుల్ సెంచరీ వీరుడు అజహర్ అలీకి తోడుగా బాబర్ అజామ్(30 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. 124 ఓవర్లు ముగిసేసరికి పాక్ 2 వికెట్లు కోల్పోయి 412 పరుగులు చేసింది.