అప్పుడు సబ్ స్టిట్యూట్..ఇప్పుడు రికార్డు!
దుబాయ్:అజహర్ ఆలీ..పాకిస్తాన్ తరపున ట్రిపుల్ సెంచరీ సాధించిన నాల్గో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ తో దుబాయ్ లో జరుగుతున్న పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్టులో అజహర్ అలీ ట్రిపుల్తో మెరిశాడు.469 బంతుల్లో 23 ఫోర్లు,2 సిక్సర్లతో 302 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఈ ట్రిపుల్ సెంచరీ రికార్డుకు, గతంలో ఇంజమాముల్ హక్ చేసిన ట్రిపుల్ సెంచరీకి దగ్గర సంబంధం ఉంది. 2002లో లాహోర్లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో ఇంజమామ్ ట్రిపుల్ సాధించాడు.
దాదాపు 14 సంవత్సరాల క్రితం జరిగిన ఆ మ్యాచ్లో అజహర్ అలీ సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా చేశాడు. ఇంజమామ్ ట్రిపుల్ సెంచరీ చేసిన తరువాత, అతని స్థానంలో అజహర్ అలీ సబ్ స్టిట్యూట్గా ఫీల్డ్లోకి వచ్చాడు. ఇలా తన క్రికెట్ ప్రస్థానంలో ట్రిపుల్ ను చూడటం, ఆ తరువాత అదే ఘనతను సాధించడంపై అజహర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఇదొక మరచిపోలేని అనుభూతిగా అజహర్ పేర్కొన్నాడు. ఈ ఘనత పట్ల తన భావాలను ఎలా షేర్ చేసుకోవాలో తెలియడం లేదంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడు.
'నాకు ఇంకా గుర్తుంది.ఇంజమామ్ ట్రిపుల్ చేసిన టెస్టుల్లో నేను సబ్ స్టిట్యూట్ గా వెళ్లాను. ఇప్పుడు ఆ అరుదైన ఘనతను అందుకున్నాను. ఇది ఎప్పటికీ నా జీవితంలో ప్రత్యేకంగా ఉండిపోతుంది' అని అజహర్ తెలిపాడు. తన రోల్ మోడల్ అయిన యూనస్ ఖాన్ ఈ మ్యాచ్ ను చూడకపోవడం కొంత వెలితిగా ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్న యూనస్ .. దుబాయ్ టెస్టుకు దూరం కావాల్సి వచ్చిందన్నాడు. కాగా, యూనస్ ట్రిపుల్ ను గతంలో చూసి స్ఫూర్తి పొందినట్లు అజహర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ వన్డే జట్టుకు అజహర్ అలీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతని నేతృత్వంలోని పాక్ వన్డే జట్టు 3-0 తేడాతో వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.