అజహర్ అలీ ట్రిపుల్ సెంచరీ
దుబాయ్: పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ (469 బంతుల్లో 302 నాటౌట్; 23 ఫోర్లు, 2 సిక్సర్లు) చారిత్రక టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అతను ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. పాక్ తరఫున ఓవరాల్‌గా ఇది నాలుగో ట్రిపుల్ మాత్రమే. గతంలో హనీఫ్ మొహమ్మద్, ఇంజమామ్, యూనిస్‌ఖాన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఇది 29వ ట్రిపుల్. 146 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట ప్రారంభించిన అజహర్ అదే జోరులో తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.
ముందుగా టెస్టుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న అతను పాక్ 400వ టెస్టులో త్రిశతకంతో తన ఖాతాలో పలు రికార్డులు నమోదు చేసుకున్నాడు. బ్లాక్‌వుడ్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఫోర్ కొట్టడంతో అతని ట్రిపుల్ పూర్తరుుంది. డే అండ్ నైట్ టెస్టులో తొలి ట్రిపుల్ సెంచరీగా కూడా దీనికి గుర్తింపు దక్కింది. అజహర్‌కు తోడుగా షఫీఖ్ (67), బాబర్ ఆజం (69) రాణించడంతో పాక్ తమ తొలి ఇన్నింగ్‌సను 155.3 ఓవర్లలో 579 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.