
పాక్ వన్డే కెప్టెన్ అవుట్
న్యూఢిల్లీ: అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్లో కెప్టెన్ మారాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కెప్టెన్గా, బ్యాట్స్మన్గా విఫలంకావడంతో పాక్ వన్డే జట్టు కెప్టెన్ అజర్ అలీ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించాడు. జట్టుకు సారథ్యం వహించడం వల్ల బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతోందని, ఈ ఒత్తిడి వల్లే బ్యాట్స్మన్గా రాణించలేకపోతున్నాననే కారణంతో అలీ కెప్టెన్ పదవిని వదులుకున్నాడు. అలీ వారసుడిగా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నాడు. పాక్ వన్డే, టి-20 జట్లకు సర్ఫరాజ్ సారథ్యం వహించనున్నాడు. అతను ఇంతకుముందు ఓ వన్డే, 4 టి-20లకు పాక్ జట్టుకు నాయకత్వం వహించాడు.
మూడు ఫార్మాట్లకు ఒకరినే కెప్టెన్గా నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. టెస్టు కెప్టెన్ పదవి నుంచి మిస్బావుల్ హక్ను కూడా తప్పించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే పీసీబీ ఆదేశాలను ధిక్కరిస్తూ, టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగనని ఇటీవల మిస్బా ఎదురు తిరిగాడు. ఈ నేపథ్యంలో మిస్బాపై కూడా పీసీబీ వేటు వేస్తుందా లేక అతన్నే కెప్టెన్గా కొనసాగిస్తుందా అన్నది వేచిచూడాలి. నిర్ణయం తీసుకునేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని మిస్బా పీసీబీని కోరాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో పాక్ దారుణంగా విఫలమైంది. మిస్బా నాయకత్వంలోని పాక్ టెస్టు పరాజయాలు ఎదుర్కొంది.