నాన్‌జింగ్ (చైనా): మూడోసారి పతకం సాధించాలనే లక్ష్యంతో సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో కిడాంబి శ్రీకాంత్... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత స్టార్ సైనా నెహ్వాల్ రెండో రౌండ్‌లో అలవోక విజయం సాధించగా... పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్‌కు కూడా ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. పదో సీడ్ సైనా రెండో రౌండ్‌లో 21–17, 21–8తో కేవలం 38 నిమిషాల్లో దెమిర్‌బాగ్ (టర్కీ)ను ఓడించింది. తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదుర్కొన్న సైనా రెండో గేమ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరంభంలోనే 8–3తో ముందంజ వేసిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఆ తర్వాత అదే జోరు కొనసాగించింది. స్కోరు 13–7 వద్ద సైనా వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 19–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే ఊపులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో
సైనా ఆడుతుంది.
ప్రపంచ 87వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆరో ర్యాంకర్ శ్రీకాంత్ 21–15, 21–16తో గెలుపొందాడు. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండో గేమ్‌లో స్కోరు 11–10 వద్ద వరుసగా ఆరు పాయింట్లు గెలుపొంది 18–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఎన్గుయెన్ తేరుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
పురుషుల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట రెండో రౌండ్‌కు చేరింది. తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 12–21, 21–19తో మార్కస్ ఇలిస్–క్రిస్ లాంగ్‌రిడ్జ్ (ఇంగ్లండ్) జంటను ఓడించింది. ఈ గెలుపుతో గత ఏప్రిల్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ జంట చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప ద్వయం 10–21, 21–17, 21–18తో 15వ సీడ్ లామ్స్‌ఫస్–ఇసాబెల్ (జర్మనీ) జోడీపై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
మరోవైపు తెలంగాణ క్రీడాకారిణి సిక్కి రెడ్డికి డబుల్స్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి–అశ్విని జంట 19–21, 21–10, 21–17తో చియాంగ్ కై సిన్–హంగ్ షిన్ హాన్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 16–21, 4–21తో ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రోహన్ కపూర్–కుహూ గార్గ్ 12–21, 12–21తో క్రిస్ అడ్‌కాక్–గాబ్రియేలా (ఇంగ్లండ్) చేతిలో... సౌరభ్ శర్మ–అనుష్క 18–21, 11–21తో చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మేఘన–పూర్వీషా 15–21, 21–19, 18–21తో దెబోరా–ఇమ్కె వాన్ డెర్ (నెదర్లాండ్స్) చేతిలో... కుహూ గార్గ్–నింగ్‌షి హజారికా 19–21, 11–21తో చాంగ్ చింగ్–యాంగ్ చింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కోన తరుణ్–సౌరభ్ శర్మ 20–22, 21–18, 17–21తో ఆర్ చిన్ చుంగ్–టాంగ్ చున్ మాన్ (హాంకాంగ్) చేతిలో... అర్జున్–శ్లోక్ రామచంద్రన్ 14–21, 15–21తో ఓంగ్ యె సిన్–తెయో ఇ యి (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు.
భారత ఆటగాళ్ల నేటి షెడ్యూల్
మహిళల సింగిల్స్
సింధు (vs)ఫిత్రియాని (ఇండోనేసియా)
పురుషుల సింగిల్స్
శ్రీకాంత్ (vs) పాబ్లో అబియాన్ (స్పెయిన్)
సమీర్ వర్మ (vs) లిన్ డాన్ (చైనా)
ప్రణయ్ (vs) యగోర్ కోఎల్హో (బ్రెజిల్)
సాయిప్రణీత్ (vs) ఎన్రిక్ (స్పెయిన్)
పురుషుల డబుల్స్
సాత్విక్, చిరాగ్ శెట్టి (vs) కిమ్ యాస్ట్రప్, ఆండెర్స్ స్కారప్ (డెన్మార్క్)
సుమీత్ రెడ్డి, మనూ అత్రి (vs) టకుటో, కనెకో (జపాన్)
మహిళల డబుల్స్
సిక్కి రెడ్డి, అశ్విని (vs) ఫుకుషిమా, సయాకా హిరోటా (జపాన్)
ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment