రియో ఒలింపిక్స్‌లో మన షట్లర్ల గురి పతకంపై ఉంటే ఎలాంటి డ్రానైనా ఎదుర్కొంటారని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.
► ‘రియో’కు దీటుగా సన్నద్ధమయ్యాం
► ఒత్తిడినెదుర్కొంటే చాలు : చీఫ్ కోచ్ గోపీచంద్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో మన షట్లర్ల గురి పతకంపై ఉంటే ఎలాంటి డ్రానైనా ఎదుర్కొంటారని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. తీవ్ర ఒత్తిడిలో రెండు వరుస మ్యాచ్‌లన్ని గెలిచేస్తే పతకం చేజిక్కుతుందని చెప్పారు. భారత్ నుంచి తొలిసారి అత్యధికంగా ఏడుగురు షట్లర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న బ్యాడ్మింటన్ ‘డ్రా’ను విడుదల చేస్తారు. గ్రేటర్ నోయిడాలో అంతర్జాతీయ అకాడమీని ఏర్పాటు చేసేందుకు బుధవారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ దళానికి డ్రాపై బెంగలేదన్నారు. ఆటగాళ్లంతా బాగా సన్నద్ధమయ్యారని చెప్పారు.
‘ఒలింపిక్స్ డబుల్స్‌లో 16 మంది ఆటగాళ్లతో కూడిన డ్రానే ఉంటుంది. ఇందులో తమదైన రోజు బాగా శ్రమిస్తే గెలుపేమంత కష్టం కాబోదు’ అని గోపీ వివరించారు. గత ఈవెంట్ కంటే ఈసారి ఎక్కువమంది అర్హత పొందారని... సైనాలాంటి అనుభవజ్ఞులైన ప్లేయర్‌తో పాటు పురుషుల, మహిళల డబుల్స్ జోడీలు సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘సైనాతో పాటు కిడాంబి శ్రీకాంత్, పి.వి.సింధులకూ పతకావకాశాలున్నాయి. లండన్ గేమ్స్ అనుభవంతో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడి రాణిస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. చాలా మందికి ఒలింపిక్స్ అనుభవలేమి నిజమే అయినప్పటికీ కామన్వెల్త్, ఆసియాలాంటి మేటి ఈవెంట్లలో సత్తాచాటిన సంగతి మరువొద్దని గోపీ గుర్తుచేశారు.
పురుషుల సింగిల్స్‌లో ప్రధాన ప్రత్యర్థులు లీ చోంగ్ వీ, లిన్ డాన్, చెంగ్ లాంగ్‌లేనని భారత కోచ్ విశ్లేషించారు. ఎటొచ్చి మహిళల సింగిల్సే క్లిష్టంగా ఉందని చెప్పారు. చైనా ఆధిపత్యంతో పాటు కరోలినా మారిన్, రచనోక్‌లతో పాటు జపాన్, కొరియన్ల నుంచి కూడా గట్టి పోటీ ఉంటుందని తెలిపారు. అయితే అగ్రశ్రేణి క్రీడాకారిణిలెవరూ ఈ ఏడాది నిలకడను చూపెట్టలేదని... ఈ నేపథ్యంలో ఫలానా ప్లేయర్ ఫేవరెట్ అని చెప్పడం కష్టమని గోపీ చెప్పుకొచ్చారు.
ఉత్తర భారతదేశంలోనూ అకాడమీని నెలకొల్పాలని భావించిన గోపీచంద్... గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అధునాతన అకాడమీని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. గ్రేటర్ నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీ, స్పోర్ట్స్‌లైవ్‌లతో కలిసి ఈ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదివరకే ఆయనకు హైదరాబాద్‌లో రెండు అకాడమీలతో పాటు గ్వాలియర్, వడోదరల్లో ఒక్కో అకాడమీ ఉంది.