గుత్తా జ్వాలపై వేటుకు సిఫారసు
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాలపై వేటు వేసేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాదీపై జీవితకాల నిషేధం విధించాలని బాయ్ క్రమశిక్షణ సంఘం సిఫారసు చేసింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సందర్భంగా ఓ మ్యాచ్లో జ్వాల తన జట్టు క్రిష్ ఢిల్లీ స్మాషర్స్కు చెందిన కొందరు షట్లర్లు ఆడకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిందని నిర్ధారించింది.
ఆమెపై జీవతకాల నిషేధం లేదా కొంతకాలం పాటు సస్పెన్షన్ విధించాలని క్రమశిక్షణ సంఘం సిఫారసు చేసినట్టు బాయ్ వర్గాలు ధ్రువీకరించాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సిఉందని వెల్లడించారు. ఐబీఎల్లో బంగా బీట్స్తో మ్యాచ్ సందర్భంగా జ్వాల వ్యవహారశైలిపై విమర్శలు రావడంతో బాయ్ విచారణకు ఆదేశించింది. కాగా బాయ్, జ్వాల మధ్య వివాదం చెలరేగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ జ్వాల పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. ఐబీఎల్ నిర్వాహకులపైనా వేలం విషయంలో విరుచుకుపడింది.