షార్జా: అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. బల్ఖ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాబుల్ జ్వనాన్ బ్యాట్స్‌మన్ హజ్రతుల్లా జజాయ్ ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టడంతోపాటు 37 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. అబ్దుల్లా మజారి వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో హజ్రతుల్లా (6, 6, వైడ్, 6, 6, 6, 6) రెచ్చిపోవడంతో ఈ అద్భుతం జరిగింది. ఇదే జోరులో హజ్రతుల్లా 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి... టి20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేశాడు. గతంలో యువరాజ్ (2007లో ఇంగ్లండ్‌పై), క్రిస్ గేల్ (2016 బిగ్‌బాష్ లీగ్‌లో) కూడా 12 బంతుల్లోనే అర్ధ సెంచరీలు చేశారు.
హజ్రతుల్లా (17 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) అదరగొట్టినా ఈ మ్యాచ్‌లో కాబుల్ జ్వనాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలుత బల్ఖ్ లెజెండ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 244 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (48 బంతుల్లో 80; 2 ఫోర్లు, 10 సిక్స్‌లు) వీరవిహారం చేయడంతో బల్ఖ్ లెజెండ్స్ 23 సిక్స్‌లు బాది ఓ టి20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా రికార్డు సృష్టించింది. 21 సిక్స్‌లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2013లో), వెస్టిండీస్ (2016లో), రంగ్‌పూర్ రైడర్స్ (2017లో), భారత్ (2017లో) పేరిట ఉన్న రికార్డును బల్ఖ్ లెజెండ్స్ తిరగరాసింది. అనంతరం కాబుల్ జ్వనాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment