మీడియాతో మాట్లాడుతున్న గౌతమ్ గంభీర్
సాక్షి, ముంబై; టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థానీయులను భారత్‌లో అడుగుపెట్టనివ్వకుండా నిషేధించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సాయంత్రం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఒక్క క్రికెట్‌లోనే కాదు.. సినిమాలు, సంగీతం.. అన్ని రంగాల్లోనూ పాకిస్థాన్‌ను నిషేధించాలి. సరిహద్దులో వాళ్లు మన సైనికులను చంపుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? శాంతి చర్చలు ప్రభుత్వం చేయాల్సిన పని. పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చే వరకు వారిని మనదేశంలోకి అడుగుపెట్టనీయకపోవటమే ఉత్తమం’ అని గంభీర్ అభిప్రాయపడ్డారు. గతేడాది ఏప్రిల్‌లో సుక్మా జిల్లా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సైనికుల పిల్లల చదువుకయ్యే ఖర్చును భరించిన గంభీర్..తాజాగా గురువారం రాత్రి వారితో కలిసి డిన్నర్ చేసి సందడి చేశాడు.
రేంజర్లను చంపటం మంచిదే... ఇక సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలపై గంభీర్ స్పందించారు. ‘గతంలో పాక్‌ను చర్చల కోసం అనేకసార్లు భారత్ ఆహ్వానించింది. కానీ, ఏం సాధించాం?. ఒక పక్క చర్చలంటూనే.. మరో పక్క మన సైనికులను పాక్ పొట్టనపెట్టుకుంటోంది. ప్రతిగా పాక్ రేంజర్లను మన సైన్యం చంపటంలో ఎలాంటి తప్పు లేదు. సహనం అనేది కొంత వరకే ఉండాలి. ముందు శాంతి బాటలో చర్చలు జరపాలి. కుదరకపోతే కఠిన చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో రాజకీయాలకు తావు ఇవ్వకూడదు’ అని గంభీర్ పేర్కొన్నారు. అన్నట్లు ఈ స్టార్ బ్యాట్స్‌మన్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 2016లో పాక్‌తో క్రికెట్ సిరీస్ గురించి కేంద్ర ప్రభుత్వం-బీసీసీఐలు పాక్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపిన వేళ, ఓ ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ.. ‘భారత సైనికులను చంపుకుంటూ పోతుంటే పాక్‌తో క్రికెట్ ఎలా ఆడాతామంటూ’ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment