22 పరుగుల వ్యవధిలో తొమ్మిది వికెట్లు
రాయ్పూర్:దేశవాళీ లీగ్ల్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో బరోడా కుప్పకూలింది. గ్రూప్-ఎలో తమిళనాడుతో శనివారం ఆరంభమైన మ్యాచ్లో బరోడా తొలి ఇన్నింగ్స్ లో 93 పరుగులకే చాపచుట్టేసింది. 71 పరుగుల వరకూ వికెట్ మాత్రమే కోల్పోయి పోటీనిస్తున్నట్లు కనబడిన బరోడా.. ఆపై మరో 22 పరుగులు చేసి మిగతా తొమ్మిది వికెట్లను నష్టపోయింది. తమిళనాడు మీడియం పేసర్లు కృష్ణమూర్తి విఘ్నేష్, అశ్విన్ క్రిష్ట్లు బరోడాను చావు దెబ్బ తీశారు.
విఘ్నేష్ ఐదు వికెట్లు సాధించగా, అశ్విన్ క్రిష్ట్కు నాలుగు వికెట్లు తీశాడు. బరోడా ఆటగాళ్లలో దేవ్ ధార్(26), మిస్త్రీ(23), సోలంకి(14)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా, మరో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్లుగా వెనుదిరిగారు. ఆ తరువాత 79/1 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్న తమిళనాడు లంచ్ ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. తమిళనాడు ఆటగాడు అభినవ్ ముకుంద్(100)శతకం సాధించాడు.