కోహ్లి.. సర్దుకుపోతేనే మంచిది!
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇటీవల బీసీసీఐ ప్రకటన విడుదల చేసినప్పటికీ, ప్రస్తుతానికి కోచ్ ను మార్చే యోచనలో లేనట్లే కనబడుతోంది. చాంపియన్స్ ట్రోఫీ తరువాత భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ వస్తాడని ఆశించినా, కొంతకాలం పాటు అనిల్ కుంబ్లేనే ఆ పదవిలో కొనసాగించాలని బోర్డు చూస్తోంది. దీనిలో భాగంగానే ఈ నెల చివర్లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు కుంబ్లేనే కోచ్ గా ఉండనున్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాల కారణంగానే కుంబ్లే పదవి పొడిగింపుపై పెద్దగా ఆసక్తికనబరచని బీసీసీఐ.. ఆ మేరకు కోచ్ పదవికి ఆప్లికేషన్స్ ను కూడా ఆహ్వానించింది. అయితే మరికొంత కాలం కుంబ్లే కొనసాగింపుకు బీసీసీఐ మొగ్గుచూపుతోంది. దీనిలో భాగంగా కోహ్లిని సముదాయించినట్లు తెలుస్తోంది.
'చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే కొత్త కోచ్ ను నియమించాలని బీసీసీఐ క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) భావించడం లేదు. వెస్టిండీస్ పర్యటనకు కుంబ్లే వెళ్లనున్నాడు. అది చిన్న పర్యటన కావడంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుంబ్లే కొనసాగింపుపై బీసీసీఐ సీఈవోకు సీఏసీ ఇప్పటికే స్పష్టం చేసింది. మరొకవైపు కుంబ్లే-కోహ్లిలతో కూడా సమావేశమైంది. ఆ సమయంలోనే కుంబ్లేతో సర్దుకోవాలని కోహ్లికి ముగ్గురు సభ్యులతో కూడిన సీఏసీ తెలిపింది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.