కోహ్లి ఓటు ఎవరికి?
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చేతిలో ఉందని బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి.. ఇద్దరిలో ఒకరిని ఎంచుకునేందుకు బీసీసీఐ కోహ్లి సహాయం కోరిందని తెలిపాయి. వీరిద్దరిలో ఒకరి పేరు ఖరారు చేసే అవకాశముందని చెప్పాయి. తన నిర్ణయాన్ని కోహ్లి బుధవారం బీసీసీఐకు వెల్లడించే అవకాశముందని పేర్కొన్నాయి. అయితే కుంబ్లేకు కోచ్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
కోచ్ ఎంపిక కోసం బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ మంగళవారం ఏడుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. వీరిలో అనిల్ కుంబ్లే, ప్రవీణ్ ఆమ్రే, లాల్‌చంద్ రాజ్‌పుత్ నేరుగా కమిటీ ముందు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మాజీ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు విదేశీయులు టామ్ మూడీ, స్టువర్ట్‌లా, ఆండీ మోల్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ప్రజెంటేషన్‌ను అందించారు. కమిటీ తన నివేదికను బుధవారం బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కేకు సమర్పించే అవకాశం ఉంది. 24న జరిగే బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో అధికారికంగా కోచ్ పేరును ప్రకటిస్తారు.