ఐపీఎల్ హక్కుల కోసం 18 కంపెనీలు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హక్కుల కోసం ప్రఖ్యాత సంస్థలన్నీ పోటీ పడుతున్నాయి. హక్కుల కోసం లభిస్తున్న స్పందన పట్ల బీసీసీఐ ఉబ్బితబ్బిబ్బవుతోంది. తాజాగా ఈ జాబితాలో సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్ కూడా చేరడం విశేషం. ఐపీఎల్ డిజిటల్ రైట్స్ కోసం ఈ సంస్థలు టెండరు డాక్యుమెంట్లను కొనుగోలు చేశాయని బోర్డు ప్రకటించింది. ‘భారత క్రికెట్‌లో ఇది చారిత్రాత్మక క్షణం. ప్రముఖ సంస్థలు హక్కుల కోసం ఆసక్తి చూపించడం ఐపీఎల్ గొప్పతనాన్ని, దానిపై వారి నమ్మకాన్ని సూచిస్తోంది’ అని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
2018 ఏడాదితో మొదలు పెట్టి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను పదేళ్ల కోసం, డిజిటల్, మొబైల్ హక్కులను ఐదేళ్ల కాలానికి ఇవ్వనున్నారు. అక్టోబర్ 18 వరకు టెండర్లు స్వీకరించి అక్టోబర్ 25న ఎంపికై న బిడ్డర్‌ను ప్రకటిస్తారు. ఇప్పటి వరకు మూడు వేర్వేరు తరహాల హక్కులకు సంబంధించి మొత్తం 18 సంస్థలు ఇప్పటి వరకు పోటీలో నిలిచాయి. టీవీ ప్రసారం కోసం సోనీ, స్టార్ గ్రూప్‌ల మధ్య భారీ పోటీ నెలకొని ఉండగా... ఇతర హక్కుల కోసం ట్విట్టర్, ఫేస్‌బుక్‌తో పాటు అమెజాన్, రిలయన్‌స జియో, టైమ్స్ ఇంటర్నెట్, గల్ఫ్ డీటీహెచ్, ఈఎస్‌పీఎన్, జీ తదితర కంపెనీలు పోటీ పడుతున్నాయి.