ఆ ఇద్దరికి పోలిక ఏమిటి? | BCCI Trolled For Two Greats Tweet | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరికి పోలిక ఏమిటి?

Published Sat, Sep 21 2019 10:54 AM | Last Updated on Sat, Sep 21 2019 10:58 AM

BCCI Trolled For Two Greats Tweet - Sakshi

బెంగళూరు:  రాహుల్‌ ద్రవిడ్‌.. భారత టెస్టు క్రికెట్‌ను ఒక స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్‌.  అద్భుతమైన టెక్నిక్‌తో దిగ్గజ బౌలర్లకు సైతం వణుకుపుట్టించిన గ్రేట్‌ బ్యాట్స్‌మన్‌. భారత క్రికెట్‌లో ఒక ‘ద వాల్‌’గా కీర్తించబడ్డ ఏకైక క్రికెటర్‌. కష్టకాలంలో భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి తనదైన మార్కు వేసిన ఆటగాడు. చాలా సందర్బాల్లో కీపింగ్‌ బాధ్యతల్ని కూడా మోసి తనకు ఏదీ భారం కాదని అనిపించుకున్న మొనగాడు. భారత-ఏ, అండర్‌-19 జట్లను రాటుదేలేలా చేసి ప్రత్యేక ముద్ర వేశాడు ద్రవిడ్‌.

కాగా, గతంలో భారత జాతీయ క్రికెట్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను ఎంపిక చేసిన సందర్భంలో అప్పటి, ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ రవిశాస్త్రి నుంచి నిరసన వ్యక్తమైంది. ప్రధానంగా భారత విదేశాల్లో ఆడేటప్పుడు ద్రవిడ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా  నియమించడానికి అప్పటి క్రికెట్‌ సలహా మండలిలోని సభ్యులు సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకుంటే దానిని వ్యతిరేకించాడు రవిశాస్త్రి. తనకు బ్యాటింగ్‌ కోచ్‌గా ఎక్కడైనా సంజయ్‌ బంగరే కావాలంటూ తన పంతం నెగ్గించుకున్నాడు.

ఇందుకు వినోద్‌ రాయ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ పరిపాలన కమిటీ కూడా ఆమోదం తెలపడంతో రవిశాస్త్రి పని మరింత సులువైంది. ఇదిలా ఉంచితే, ఇప్పుడు రవిశాస్త్రి-ద్రవిడ్‌లు కలిశారు. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ జరగాల్సిన సందర్భంలో ద్రవిడ్‌-రవిశాస్త్రిలు ఒకరితో ఒకరు కరాచలనం చేసుకున్నారు. దీనిపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఇద్దరూ ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసింది. ఇందుకు ఇద్దరు దిగ్గజాలు కలిశారనే ట్యాగ్‌ ఇచ్చింది.  దాంతో అభిమానుల్ని నుంచి మిశ్రమ స్పందన వస్తుంది.

ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్న అభిమానులు.. ‘ ఆ ఇద్దరికీ పోలిక ఉందా’ అని ప్రశ్నిస్తున్నారు. ‘ ద్రవిడ్‌ సర్‌తో రవిశాస్త్రికి పోలిక ఏమిటి.. అతన్ని  ఎవరితోనూ పోల్చవద్దు. నా ఏకైక హీరో  ద్రవిడ్‌’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా,  భారత్‌ క్రికెట్‌ జట్టుకు రాహుల్‌ ద్రవిడ్‌ సేవలు అవసరం’ అని ట్వీట్‌ చేశాడు. ఇద్దరు వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉ‍న్న విషయం ఫోటోలోనే కనబడుతుంది’ అని మరొకరు పేర్కొన్నారు. ఇలా వీరిద్దరి ఫోటోను బీసీసీఐ ట్వీట్‌ చేయడంపై ట్రోల్స్‌ కు పని చెప్పినట్లయ్యింది.  దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో భారత్‌ విజయం సాధించడంతో 1-0 ఆధిక్యం సాధించింది. తొలి మ్యాచ్‌ రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం నమోదు చేసింది. ఇక టీ20 సిరీస్‌ లక్ష్యంగా భారత్‌ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం ఇరు జట్ల మధ్య మూడో టీ20 జరుగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement