
ఫేవరెట్లు జాగ్రత్త పడాల్సిందే! బెంబేలెత్తిస్తున్న బెల్జియంను తట్టుకోవాలంటే తప్పకుండా వ్యూహరచన చేయాల్సిందే. ఈ ఫిఫా ప్రపంచకప్‌లో ‘చాంపియన్ల’కు దీటుగా రాణిస్తున్న జట్టేదైనా ఉందంటే అది బెల్జియమే! మెరికల్లాంటి ఫార్వర్డ్, దుర్భేద్యమైన డిఫెన్స్‌తో రోజు రోజుకూ పటిష్టమైన జట్టుగా ఎదుగుతోంది. గ్రూప్ ‘జి’లో ఇంగ్లండ్ కంటే ముందుగా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరింది. లుకాకు డబుల్ మ్యాజిక్ స్పార్టక్ స్టేడియాన్ని ఊపేసింది.
మాస్కో: పనామాపై 3–0తో గెలిచింది బెల్జియం. అయినా కోచ్‌తో మాట పడాల్సి వచ్చింది. కోచ్ రాబెర్టో మార్టినెజ్ ఇదేం ఆట? ఇంత నింపాదిగానా? అని అసంతృప్తి వెలిబుచ్చారు. ఆయన అసంతృప్తికి ఈ మ్యాచ్ సగంలోపే సమాధానమివ్వాలనుకున్నారో ఏమోగానీ బెల్జియం ఆటగాళ్లు బెంబేలెత్తించారు. 3–1తో తొలి భాగాన్ని ముగించిన బెల్జియం... చివరకు 5–2తో ట్యూనిషియాను దడదడలాడించింది. వరుసగా రెండో భారీ విజయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ ‘జి’ నుంచి వరుస విజయాలతో ఈ అర్హత సంపాదించింది. స్పార్టక్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియం మ్యాచ్ ఆసాంతం గర్జించింది. స్టార్ స్ట్రయికర్ రొమెలు లుకాకు ఈ మ్యాచ్‌లోనూ రెండు గోల్స్ సాధించాడు. మొత్తం నాలుగు గోల్స్‌తో ఈ టోర్నీలో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) సరసన నిలిచాడు. ఆట ఆరంభమే బెల్జియం ఆధిక్యంతో మొదలైంది. 6వ నిమిషంలో లభించిన పెనాల్టీని మిడ్‌ఫీల్డర్ ఎడెన్ హజార్డ్ గోల్‌గా మలిచాడు. మరో పది నిమిషాలకు ఈ ఆధిక్యం రెట్టింపైంది. ఆట 16వ నిమిషంలో మెర్టెన్స్ ఇచ్చిన పాస్‌ను ఎలాంటి పొరపాటు చేయకుండా లుకాకు గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు.
అయితే రెండు నిమిషాల వ్యవధిలోనే ట్యూనిషియా డిఫెండర్ డిలాన్ బ్రాన్ గోల్ చేయడంతో బెల్జియం ఆధిక్యం 2–1కు తగ్గింది. 18వ నిమిషంలో కెప్టెన్ ఖాజ్రీ ఫ్రికిక్ షాట్‌ను బ్రాన్ గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. ప్రథమార్థం ముగిసే దశలో లుకాకు మరో గోల్ సాధించాడు. ఇంజ్యూరీ టైమ్ (45+3వ ని.)లో మెనియెర్‌తో కుదిరిన సమన్వయంతో లుకాకు గోల్ చేసి తొలి అర్ధభాగాన్ని 3–1తో ముగించాడు. తర్వాత ద్వితీయార్ధం కూడా ప్రథమార్థంలాగే మొదలైంది. ఆరు నిమిషాల్లో బెల్జియం మళ్లీ గోల్‌తో గర్జించింది. 51వ నిమిషంలో అల్డెర్ విరెల్డ్ నుంచి వచ్చిన బంతిని హజార్డ్ ఛాతితో నియంత్రించి మెరుపు వేగంతో గోల్ కొట్టాడు. అప్పుడు... ఇప్పుడు ఆట మొదలైన ఆరు నిమిషాలకే హజార్డ్ గోల్ చేయడం విశేషం.
ఎక్స్‌ట్రా టైమ్ కంటే ముందే సాకర్ ప్రపంచకప్‌లో బెల్జియం ఏకంగా 4 గోల్స్ చేయడం ఇదే తొలిసారి. సరిగ్గా 90వ నిమిషంలో టియెలిమన్స్ కార్నర్ దిశగా ఇచ్చిన పాస్‌ను మైకీ బట్షువయి గోల్ పోస్ట్‌లోకి నెట్టేశాడు. దీంతో 5–1 ఆధిక్యంతో గెలిచేందుకు సిద్ధమైంది బెల్జియం. అయితే ఇంజ్యూరీ టైమ్ (90+3వ ని.)లో ఈ సారి ట్యూనిషియా గోల్ సాధించింది. కెప్టెన్ ఖాజ్రీ కొట్టిన ఈ గోల్‌తో ఆధిక్యం 5–2కు తగ్గింది. ఈ మ్యాచ్‌లో బెల్జియం ఆట అద్భుతంగా సాగింది. 12 సార్లు లక్ష్యంపై గురిపెట్టిన ఆ జట్టు ఐదు సార్లు సఫలమైంది. ప్రత్యర్థి ట్యూని షియా ఐదుసార్లు ప్రయత్నించి 2 గోల్స్‌తో సరిపెట్టుకుంది. బెల్జియం తమ గ్రూప్‌లో చివరి మ్యాచ్‌ను ఈ నెల 28న ఇంగ్లండ్‌తో ఆడనుంది.
► 2 డిగో మారడోనా తర్వాత ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా లుకాకు చరిత్రకెక్కాడు. 1986లో మారడోనా ఇంగ్లండ్, బెల్జియంలపై రెండేసి గోల్స్ సాధించాడు.
► 5 వరల్డ్‌కప్ చరిత్రలో బెల్జియం ఒక మ్యాచ్‌లో 5 గోల్స్ చేయడం ఇదే ప్రథమం. ఓవరాల్‌గా ఒకే మ్యాచ్‌లో ఏడు గోల్స్ నమోదు కావడం తొమ్మిదోసారి.
► 6 ప్రపంచకప్ గ్రూప్ దశలో బెల్జియంకు ఇది వరుసగా ఆరో విజయం. 2002లో ఒకటి, 2014లో మూడు, ఇప్పుడు రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.
► 0 గత 13 ప్రపంచకప్‌ల్లో బరిలోకి దిగిన ట్యూనిషియా ఒక్క మ్యాచ్ గెలవలేకపోయింది. నాలుగు డ్రా చేసుకుంటే తొమ్మిదింట పరాజయమే!
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment