
మెకల్లమ్ మెరుపులు
షార్జా: కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ మెరుపు సెంచరీ (145 బంతుల్లో 153 బ్యాటింగ్; 17 ఫోర్లు, 8 సిక్స్‌లు) సాధించడంతో పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 45 ఓవర్లలో వికెట్ నష్టానికి 249 పరుగులు చేసింది. లాథమ్ (13) అవుటయ్యాడు. మెకల్లమ్‌తో పాటు కేన్ విలియమ్సన్ (76 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు.
78 బంతుల్లోనే సెంచరీ చేసిన మెకల్లమ్ న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో వేగంగా శతకం చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 281/3తో తొలి ఇన్నింగ్స్‌ను మొదలెట్టిన పాక్ 351 పరుగులకే ఆలౌటైంది. హఫీజ్ (197) తృటిలో డబుల్ సెంచరీని కోల్పోయాడు. కివీస్ యువ స్పిన్నర్ మార్క్ క్రెయిగ్ 7 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు వెనుకబడి ఉంది.