
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ 44 బంతుల్లోనే శతక్కొట్టి పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. టీ20ల్లో పాక్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ 2021లో సౌతాఫ్రికాపై 49 బంతుల్లో శతక్కొట్టాడు.
నవాజ్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ నిర్ధేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ 16 ఓవర్లలోనే ఊదేసింది. ఈ గెలుపుతో పాక్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో ఘన విజయాలు సాధించిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించింది.
అయితే కివీస్ అశలపై హసన్ నవాజ్ నీళ్లు చల్లాడు. నవాజ్ తన కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించడం విశేషం. ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నవాజ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు.
పాక్ క్రికెట్ జట్టు విషయానికొస్తే.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలీదు. వరుసగా పరాజయాలతో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఆ జట్టు.. ఒక్కసారిగా సంచలన ప్రదర్శనతో భారీ లక్ష్యాన్ని ఛేదించి ఊహించని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఇటీవలికాలంలో ఆ జట్టు ప్రదర్శన అంత దారుణంగా ఉంది మరి. నవాజ్ తన సుడిగాలి శతకంతో పాక్ క్రికెట్‌లో ఒక్కసారిగా హీరో అయిపోయాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్‌మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో చాప్‌మన్ తర్వాత ఎవరూ ఆ స్థాయిలో రాణించలేదు.
ఆఖర్లో కెప్టెన్ బ్రేస్‌వెల్ (18 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. టిమ్ సీఫర్ట్ (19), డారిల్ మిచెల్ (17), ఐష్ సోధి (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఫిన్ అలెన్ 0, నీషమ్ 3, మిచెల్ హే 9, జేమీసన్ 0, డఫీ 2 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఆది నుంచి దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), హసన్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించారు. హరీస్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా పాక్ మరో 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ కోల్పోయిన ఏకైక వికెట్ డఫీకి దక్కింది. ఈ సిరీస్‌లో నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment