
వెంటాడే ‘స్ట్రోక్స్’..!
వెస్టిండీస్ సంబరాలు ఒక వైపు సాగుతుంటే మరో వైపు నేలపై కూలబడిన ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్‌ను చూస్తే క్రికెట్‌లో హీరోలు విలన్లు .....
ఒక్క ఓవర్‌తో మారిన రాత స్టోక్స్ కెరీర్‌లో చేదు జ్ఞాపకం
వెస్టిండీస్ సంబరాలు ఒక వైపు సాగుతుంటే మరో వైపు నేలపై కూలబడిన ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్‌ను చూస్తే క్రికెట్‌లో హీరోలు విలన్లు అయ్యేందుకు ఒక్క ఓవర్ కూడా సరిపోతుందని మరోసారి రుజువయింది. బ్రాత్‌వైట్ గర్జనతో అందరికీ విండీస్ విజయం కనిపిస్తుంటే, నాణేనికి మరో వైపు స్టోక్స్ వేదన వర్ణించరానిది. ఇటీవలి కాలంలో ఒక్కసారిగా దూసుకొచ్చి అసలైన ఆల్‌రౌండర్‌గా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో స్టోక్స్ ఉన్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు మెరుగైన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ మీడియా దృష్టిలో మరో బోథమ్‌లా కనిపించాడు. దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో చేసిన మెరుపు డబుల్ సెంచరీ అతడిని స్టార్‌ను చేసింది. అయితే ఇప్పుడు దానికంటే స్టోక్స్ చివరి ఓవర్ బాధితుడిగానే ఎక్కువగా గుర్తుండిపోతాడు.
నమ్మకం నిలబడలేదు ప్రపంచకప్‌లో ఫైనల్‌కు ముందు రెండు మ్యాచ్‌లలో స్టోక్స్ ప్రదర్శన అతనితో ఆఖరి ఓవర్ వేయించేలా మోర్గాన్‌ను ప్రోత్సహించింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో చక్కటి యార్కర్లతో అతను బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగాడు. చివరి ఓవర్లో విజయానికి శ్రీలంకకు 15 పరుగులు కావాల్సి ఉండగా స్టోక్స్ కేవలం 4 పరుగులే ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో అయితే చివరి 2 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే బ్రాత్‌వైట్ విధ్వంసానికి అతను బలి అయ్యాడు.
తొలి సారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడిని అతను దాటలేకపోయాడు. ఫలితమే ఎప్పటికీ బాధించే నాలుగు సిక్సర్ల బాదుడు. అతను తీవ్ర నిరాశలో కూరుకుపోయిన మాట వాస్తవం. రాబోయే కొన్ని రోజులుఇది అతడిని వెంటాడుతుందనడంలో సందేహం లేదు. అయితే మేం జట్టుగా విజయానందాన్ని పంచుకున్నాం కాబట్టి అతని బాధను కూడా సమష్టిగా పంచుకుంటున్నాం అని కెప్టెన్ మోర్గాన్ సాంత్వన ఇచ్చే ప్రయత్నం చేశాడు.
నువ్వు గొప్ప క్రికెటర్ కావాలి
స్టోక్స్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి వెస్టిండీస్‌ను గెలిపించిన బ్రాత్‌వైట్... తమ ప్రత్యర్థి బౌలర్ గొప్ప క్రికెటర్ కావాలని ఆకాంక్షించాడు. ‘యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టిన తర్వాతే బ్రాడ్ గొప్ప బౌలర్‌గా ఎదిగాడు. స్టోక్స్ గత రెండు నెలలుగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌ను మరచిపోయి తను ముందుకు సాగాలి. భవిష్యత్‌తో ఓ దిగ్గజంలా ఎదగాలి’ అని బ్రాత్‌వైట్ ఆకాంక్షించాడు. తనకోసం బ్యాట్ తయారు చేసి ఇచ్చిన ఎర్రోల్ ఎడీ అనే వ్యక్తికీ కృతజ్ఞతలు చెప్పాడు.
బ్రాడ్ తరహాలోనే...
2007 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టినప్పుడు కూడా బౌలర్‌పై అంతా జాలి పడ్డారు. బ్రాడ్ కోలుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. ఎప్పుడు భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ జరిగినా అంతా అతనికి అదే గుర్తు చేయడం ఆవేదనకు గురి చేసేది. నాడు అది ఒక లీగ్ మ్యాచ్ మాత్రమే. ఇప్పుడు ఇది ప్రపంచకప్ ఫైనల్. ఈ ఓవర్ వల్ల స్టోక్స్ కెరీర్‌పై ఇప్పటికిప్పుడు నేరుగా ప్రభావం చూపించకపోయినా, అది అతడిని జీవితాంతం వెంటాడుతుంది. ఆ నాలుగు బంతులు కలలో కూడా వెంటాడుతాయి. అతనిపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మాత్రం సానుభూతి చూపిస్తోంది.