
ఇంగ్లండ్-4, పాకిస్తాన్-0!
పాకిస్తాన్తో జరిగిన నాల్గో వన్డేలో ఇంగ్లండ్ విజయ లక్ష్యం 248. గత మూడు వన్డేల్లో గెలిచి మంచి ఊపుమీద ఉన్నఇంగ్లండ్కు ఇది ఏమాత్రం పెద్ద లక్ష్యం కాదు.
లీడ్స్: స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇంగ్లండ్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా నాల్గో వన్డేలో కూడా విజయం సాధించిన ఇంగ్లండ్ సిరీస్లో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. పాకిస్తాన్తో ఇక్కడ గురువారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ కు పాక్ నిర్దేశించిన విజయ లక్ష్యం 248. గత మూడు వన్డేల్లో గెలిచి మంచి ఊపుమీద ఉన్నఇంగ్లండ్కు ఇది ఏమాత్రం పెద్ద లక్ష్యం కాదు. అయితే 72 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఆ సమయంలో బెన్ స్టోక్స్, బెయిర్ స్టోల జోడి పాకిస్తాన్ పై ఎదురుదాడికి దిగింది. ఒకవైపు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ బెయిర్ స్టో(61;83 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోగా, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్(69;70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్పర్లు) తనదైన శైలిలో అలరించాడు.
ఈ జోడి 103 పరుగుల భాగ్వస్యామ్యం జోడించిన అనంతరం స్టోక్స్ ఐదో వికెట్ గా వెనుదిరగగా, ఆ తరువాత బెయిర్ స్టో-మొయిన్ అలీ(45 నాటౌట్) జంట 53 పరుగులు నమోదు చేసింది. దీంతో ఇంగ్లండ్ ఇంకా రెండు ఓవర్లు ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 247 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో అజహర్ అలీ(80), ఇమాద్ వసీమ్(57 నాటౌట్)లు రాణించారు. ఈ సిరీస్లో ఇప్పటివరకూ ఓటమి లేకుండా ఇంగ్లండ్ 4-0తో ముందంజలో ఉండగా, పాకిస్తాన్ మాత్రం బోణి కొట్టడానికి అపసోపాలు పడుతోంది.