
పుణే: ప్రారంభంలో ఆధిపత్యం చెలాయించినా... చివర్లో ఒత్తిడికి గురైన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌లో ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో తొలిసారి బెంగళూరు బుల్స్‌తో తలపడిన టైటాన్స్ హోరాహోరీ పోరులో ఓటమి పాలైంది. జోన్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 34–26తో టైటాన్స్‌పై గెలిచింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది.
మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా... ఇరు జట్లు 25–25తో సమంగా నిలిచాయి. ఈ దశలో స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని ప్రత్యర్థి జట్టు పట్టేయడంతో టైటాన్స్ ఆలౌటైంది. టైటాన్స్ తరఫున రాహుల్, విశాల్ చెరో 6 పాయింట్లు సాధించారు. బుల్స్ తరఫున రోహిత్ (8 పాయింట్లు) రాణించాడు. దీంతో బెంగళూరు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్స్ 35–33తో హరియాణ స్టీలర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి.