సఫారీలను ఓడించడం పెద్ద సవాల్ | Big challenge to defeat Safaris - rohith | Sakshi
Sakshi News home page

సఫారీలను ఓడించడం పెద్ద సవాల్

Published Thu, Oct 1 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

సఫారీలను ఓడించడం  పెద్ద సవాల్

సఫారీలను ఓడించడం పెద్ద సవాల్

భారత ఓపెనర్ రోహిత్ శర్మ వ్యాఖ్య
 
ధర్మశాల: వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనూహ్య ఓటమిని అతిగా చూడొద్దని భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అన్నాడు. టి20ల్లో చాలా నిలకడగా ఆడుతున్న ప్రొటీస్ జట్టును ఓడించడం పెద్ద సవాలేనని చెప్పాడు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడిన అంశాలు అతని మాటల్లోనే..

 ప్రత్యర్థి బలంగా ఉంది: అన్ని జట్లు నాణ్యమైన టీమ్‌ను బరిలోకి దించడంతో పాటు రిజర్వ్ సత్తాను పరీక్షించుకోవడానికి ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఉపయోగించుకుంటాయి. కాబట్టి వార్మప్ ఓటమిని అతిగా చూడొద్దు. ఎందుకంటే ప్రతి జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఏదో ఒకటి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఏదేమైనా సఫారీ జట్టు చాలా బలంగా ఉంది.

 టి20లు తక్కువే: భారత్ ఎక్కువగా టి20లు ఆడలేదు. దీన్ని అంగీకరించాల్సిందే. అయితే చాలా మందికి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి అందరూ ఆ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో రాణించడం మాకు కూడా సవాలే. ఇంకో ఐదు నెలల్లో రానున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్‌పై కూడా మేం దృష్టిపెట్టాం. ఇప్పట్నించి ఎక్కువ టి20లు ఆడేందుకు ప్రయత్నిస్తాం.
 పేస్, స్పిన్‌పై దృష్టిపెట్టాం: దక్షిణాఫ్రికా పేస్, స్పిన్ అటాకింగ్‌ను ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ రెండు విభాగాల్లో వాళ్లు పటిష్టంగా ఉన్నారు. క్రమం తప్పకుండా విదేశీ పర్యటనలకు వెళ్తే పేస్‌ను ఎదుర్కోవడం సులువవుతుంది. గత రెండేళ్లుగా మేం ఎక్కువగా విదేశీ టూర్లకు వెళ్లాం. కాబట్టి మేం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం.

 బాగా సిద్ధమయ్యాం: దక్షిణాఫ్రికాతో పోలిస్తే మేం రాబోయే మ్యాచ్ కోసం బాగా సిద్ధమయ్యాం. వాతావరణ పరిస్థితులను కూడా మాకు అనుకూలంగా మల్చుకుంటాం. చాలా తొందరగా మేం ఇక్కడికి వచ్చాం. గత కొన్ని రోజులుగా అన్ని అంశాల్లో చాలా కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇక్కడి మైదానం అద్భుతంగా ఉంది. భారత్ వెలుపలా ఇలాంటి దాన్ని నేను చూడలేదు.

 విమర్శలను పట్టించుకోను: బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోను. జట్టు అవసరాల మేరకు నేను ఆడతా. టీమ్‌కు ఏం కావాలో దాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. బౌలింగ్‌లో కూడా ఓ చెయ్యేస్తే కెప్టెన్‌కు మరో అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. శ్రీలంకలో చాలా పిచ్‌లు సీమ్ బౌలింగ్‌కు అనుకూలంగా కనిపించాయి. దీంతో మూడు నాలుగు ఓవర్లు వేస్తే ప్రధాన బౌలర్‌కు కాస్త ఉపయోగపడినట్లు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా.

 ఇద్దరూ ఇద్దరే: స్వభావాన్ని బట్టి కెప్టెన్లు ధోని, కోహ్లిలు ఇద్దరూ భిన్నం. మా అందరికీ ఈ విషయం తెలుసు. కాబట్టి వాళ్లకు సరిపోయే విధంగా మారిపోవడం పెద్ద సమస్య కాదు. మహీ మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నప్పుడు చాలా విజయాలు సాధించాం. దక్షిణాఫ్రికాకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. ఇదో భిన్నమైన ఆలోచన.
 
భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్ షెడ్యూల్
అక్టోబరు 2: తొలి టి20, ధర్మశాల (రాత్రి గం. 7.00 నుంచి)
అక్టోబరు 5: రెండో టి20, కటక్ (రాత్రి గం. 7.00 నుంచి)
అక్టోబరు 8: మూడో టి20, కోల్‌కతా (రాత్రి గం. 7.00 నుంచి)
అక్టోబరు 11: తొలి వన్డే, కాన్పూర్ (మ.గం. 1.30 నుంచి)
అక్టోబరు 14: రెండో వన్డే, ఇండోర్ (మ.గం. 1.30 నుంచి)
అక్టోబరు 18: మూడో వన్డే, రాజ్‌కోట్ (మ.గం. 1.30 నుంచి)
అక్టోబరు 22: నాలుగో వన్డే, చెన్నై (మ.గం. 1.30 నుంచి)
అక్టోబరు 25: ఐదో వన్డే, ముంబై (మ.గం. 1.30 నుంచి)
నవంబరు 5-9: తొలి టెస్టు, మొహాలీ (ఉ.గం. 9.30 నుంచి)
నవంబరు 14-18: రెండో టెస్టు, బెంగళూరు (ఉ.గం. 9.30 నుంచి)
నవంబరు 25-29: మూడో టెస్టు, నాగ్‌పూర్ (ఉ.గం. 9.30 నుంచి)
డిసెంబరు 3-7: నాలుగో టెస్టు, ఢిల్లీ (ఉ.గం. 9.30 నుంచి)
నోట్: మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement