'ఏక్తా'తా చేతిలో పాక్ ఖతం
►5 వికెట్లు తీసిన ఏక్తా బిష్త్
►95 పరుగులతో భారత్ ఘన విజయం
ప్రపంచకప్‌లో భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా దాయాది పాక్‌ను దంచేసింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ భారత విజయంలో బ్యాట్స్‌మెన్ ఘనత వహిస్తే... ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా బౌలర్లే గెలిపించారు. స్వల్ప స్కోరును కాపాడుకునే ప్రయత్నంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏక్తా బిష్త్ (10–2–18–5) అద్భుతమైన స్పెల్‌తో రెచ్చిపోయింది. ఎవరినీ క్రీజులో నిలువనీయకుండా దెబ్బ మీద దెబ్బ తీసింది. పాక్‌ను చిత్తుగా ఓడించిన మిథాలీ సేన... రెండు వారాల క్రితం ఇదే ఇంగ్లండ్‌లో భారత పురుషుల జట్టుకు ఎదురైన పరాభవాన్ని మరిపించే ప్రయత్నం చేసింది.
డెర్బీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఎదురేలేకుండా దూసుకెళ్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించి మరీ టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 95 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (72 బంతుల్లో 47; 5 ఫోర్లు), సుష్మ వర్మ (35 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. పాక్ బౌలర్లలో నష్రా సంధు 4 వికెట్లు తీసింది. తర్వాత పాకిస్తాన్ 38.1 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ సనా మీర్ (29)దే టాప్ స్కోర్. అద్భుత బౌలింగ్‌తో ఏక్తా బిష్త్ (5/18) పాక్ పతనాన్ని శాసించింది.
రాణించిన పూనమ్ రౌత్
టాస్ నెగ్గిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పూనమ్ రౌత్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్మృతి మంధన (2) విఫలమైంది. తర్వాత దీప్తి శర్మ, పూనమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరిస్తుండటంతో పరుగుల వేగం మందగించింది. రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాక జట్టు స్కోరు 74 పరుగుల వద్ద పూనమ్ రౌత్ ఔటయ్యింది. నష్ర సంధుకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించింది. తర్వాత స్వల్ప వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది. మిథాలీ రాజ్ (8), దీప్తి శర్మ (63 బంతుల్లో 28; 2 ఫోర్లు)లను నష్ర సంధు ఔట్ చేయగా... హర్మన్‌ప్రీత్ కౌర్ (10), మోనా మేశ్రమ్ (6)లిద్దరు సాదియా యూసుఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 111 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కీపర్ సుష్మ వర్మ, జులన్ గోస్వామితో కలిసి (36 బంతుల్లో 14) కాసేపు పోరాడింది.
74 పరుగులకే ఖేల్ ఖతం: జోరు మీదున్న భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న పాకిస్తాన్ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. ఒక పరుగు మీద ప్రారంభమైన పాక్ పతనం ఇక ఎక్కడా ఆగలేదు. రెండో ఓవర్ నుంచే స్పిన్నర్ ఏక్తా బిష్త్ తన మాయాజాలాన్ని చూపించింది. మొదట అయేషా జాఫర్ (1)ను ఔట్ చేసిన ఆమె... సిద్రా నవాజ్ (0), ఇరమ్ జావెద్ (0)లను పెవిలియన్ పంపింది. ఈ మూడు వికెట్లు ఎల్బీడబ్ల్యూ రూపంలోనే వచ్చాయి. జవేరియా (6) జులన్ గోస్వామి బౌలింగ్‌లో నిష్క్రమించింది. దీంతో చూస్తుండగానే పాక్ స్కోరు 26/6కు చేరింది. ఓపెనర్ నాహిదా ఖాన్ (23), కెప్టెన్ సనా మీర్ (29) ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
►10- 0 వన్డేల్లో పాకిస్తాన్‌తో తలపడిన పది సార్లు భారత్‌దే విజయం