
బెంగళూరు: వెన్నుగాయంతో ఆటకు దూరమైన భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపారు. కోలుకునేందుకు చాలా సమయం పట్టదని, సాధ్యమైనంత త్వరలోనే అతను బరిలోకి దిగే అవకాశముందని చెప్పారు. ఈ నెల ఆరంభంలో బుమ్రా జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ ఫిజియో ఆశిష్ కౌషిక్‌తో కలిసి ఇంగ్లండ్ వెళ్లాడు. అక్కడ స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించిన అనంతరం వెన్ను గాయం అంతతీవ్రమైంది కాదని, సర్జరీ అక్కర్లేదని వైద్యులు తేల్చిచెప్పినట్లు తెలిసింది.
‘ఫాస్ట్ బౌలింగ్ అనేదే అసహజమైన క్రియ. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ గాయపడమనే గ్యారంటీ ఉండదు. ఇప్పుడు సర్జరీ అవసరం లేకపోవడంతో బుమ్రా న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కల్లా కోలుకుంటాడని ఆశిస్తున్నాం’ అని భరత్ అరుణ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా లేని లోటే కనబడలేదు. పేసర్లు షమీ, ఉమేశ్ యాదవ్‌లిద్దరూ భారత గడ్డపై స్పిన్నర్లను మించి వికెట్లను పడగొట్టిన సంగతి తెలిసిందే.