జస్‌ప్రీత్ బుమ్రా(ఫైల్‌ఫొటో)
న్యూఢిల్లీ: వెన్నుగాయం కారణంగా గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టు ఆడే మ్యాచ్‌లకు దూరమైన ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చేందుకు కసరత్తులు ఆరంభించాడు. గాయం నుంచి కోలుకోవడానికి బెంగళూరులోని ఆటగాళ్ల పునరావాస శిక్షణా శిబిరమైన జాతీయ క్రికెట్ అకాడమీలోని డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న బుమ్రా.. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దానికి ముందుగానే తన వెన్నునొప్పి నుంచి ఎంతవరకూ కోలుకున్నాడనే విషయాన్ని తెలుసుకోవడానికి నెట్స్‌లో బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విశాఖలో జరుగనున్న రెండో మ్యాచ్‌లో బుమ్రా నెట్స్‌లో భారత ఆటగాళ్లకు బౌలింగ్ వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు బుమ్రా బౌలింగ్ వేసే అవకాశం ఉంది.
గాయం నుంచి దాదాపు కోలుకోవడంతో బౌలింగ్ ద్వారా తనను తాను బుమ్రా పరీక్షించుకోదలుచుకున్నాడు. నెట్స్‌లో బౌలింగ్ వేస్తే గాయం నుంచి ఎంతవరకూ తేరుకున్నాడనే విషయం స్పష్టమవుతుందని భారత క్రికెట్ జట్టు ఫిజియో నితిన్ పటేల్ తెలిపారు. కామన్ ప్రాక్టీస్‌లో భాగంగానే బుమ్రా నెట్స్‌లో రోహిత్, కోహ్లిలకు బౌలింగ్ వేస్తాడన్నారు. బుమ్రా జట్టులో లేకపోయినా నెట్స్‌లో బౌలింగ్ వేయడం అతన్ని పరీక్షించుకోవడానికి దోహదం చేస్తుందన్నారు. డిసెంబర్ 15వ తేదీన చెన్నైలో భారత్-విండీస్‌ల తొలి వన్డే జరుగనుండగా, డిసెంబర్ 18వ తేదీన విశాఖలో రెండో వన్డే జరుగనుంది. ఇక మూడో వన్డే డిసెంబర్ 22వ తేదీన కటక్‌లో నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment