
సాక్షి, చెన్నై: నగరంలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు కావేరి సెగ తగిలింది. కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు కోసం ఉధృతంగా ఆందోళనలు జరగుతున్న సమయంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించరాదంటూ ఆందోళనకారులు మొదటినుంచీ వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే)-కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆందోళనకారులు మైదానంలోకి చెప్పులు విసిరారు.
కోల్‌కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అప్పర్ టయర్ నుంచి మెయిన్ పెవిలియన్‌లోకి కొందరు వ్యక్తులు చెప్పులు విసిరారు. దీంతో మ్యాచ్‌లో ఆడని డు ప్లెసిస్, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడ్డేజా మైదానంలో పడిన చెప్పులకు బయటకు విసిరేశారు. స్టాండ్స్ నుంచి కూడా చెప్పులు దూసుకొచ్చాయి. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మరికొంతమంది ప్రేక్షకులు ఎర్రజెండాలను ప్రదర్శించారు. దీంతో వారిని కూడా పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు.
రెండేళ్ల తర్వాత చెన్నైలో సీఎస్కే మ్యాచ్ జరుగుతుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఒకవైపు కావేరి ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దుచేయాలని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్‌చేశాయి. కనీసం మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించాలని కోరాయి. ఈ నేపథ్యంలో ఒకింత ఉత్కంఠ మధ్య చెన్నై-కోల్‌కతా మ్యాచ్ జరిగింది. ఎంపైర్లు ఆలస్యంగా రావడంతో టాస్ 15 నిమిషాలు ఆలస్యమైంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానం వద్ద ఆందోళనకారులు గుమిగూడి నిరసన తెలిపారు. వందలాది మంది నల్ల టీషర్టులు ధరించి.. కావేరీ బోర్డు కోసం నినాదాలు చేశారు. నల్ల బెలూన్లు గాలిలోకి ఎగరవేశారు. దీంతో పోలీసులు బలవంతంగా ఆందోళనకారుల్ని ఈడ్చుకెళ్లి బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. కావేరి ఆందోళనల నేపథ్యంలో మైదానానికి వెళ్లే రోడ్లన్నింటిలోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ మైదానంలో కావేరి నిరసనలు చోటుచేసుకున్నాయి. పలువురు ప్రేక్షకులు మైదానంలో కావేరి నినాదాలతో హోరెత్తించారు. మైదానంలో చెప్పులు పడటం కొంత కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment