సాక్షి, చెన్నై: ఐపీఎల్ లోకి పునరాగమనం తర్వాత వరుస విజయాలతో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మంచి జోష్‌లో ఉన్నాడు. ఏకంగా 200లకుపైగా పరుగులను ఛేదించి చెన్నై జట్టు మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. ఇది తాజా ఐపీఎల్‌లో చెన్నైకు వరుసగా రెండో విజయం. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో డ్వేన్ బ్రేవో చెలరేగిపోగా.. నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సామ్ బిల్లింగ్స్ వీరవిహారం చేశాడు. 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించినప్పటికీ మైదానంలో చెన్నై జట్టు పెద్దగా విజయోత్సవాలు జరుపుకోలేదు. భావోద్వేగాలు ప్రదర్శిస్తూ.. సంబరాలు నిర్వహించలేదు. ఒకింత సంయమనంతో వ్యవహరించింది.
మైదానంలో పెద్దగా సంబరాలు చేసుకోకుండా ఇలా నిగ్రహంగా వ్యవహరించడంపై ధోనీ మ్యాచ్ అనంతరం స్పందించాడు. మైదానంలో సంబరాలు చేసుకుంటే కామెంటేటర్లు ఎక్కువగా అదే మాట్లాడుతారని, అందుకే డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించినట్టు తెలిపాడు. ‘మైదానంలో మరీ ఉత్సాహంగా ప్రవర్తిస్తే.. ఇక కామెంటేటర్లు ఆ విషయమే ఎక్కువగా మాట్లాడుతారు. డ్రెసింగ్ రూమ్ ఉంది కదా! మీ భావోద్వేగాలు అక్కడ ప్రదర్శించుకోవచ్చు’ అంటూ పేర్కొన్నాడు. రెండేళ్ల తర్వాత చెప్పాక్‌లో విజయంతో పునరాగమనం చేయడం చాలా సంతోషంగా ఉందని ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. ‘రెండేళ్ల తర్వాత విజయం పునరాగమనం చేయడం ఆనందంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌నూ, రెండో ఇన్సింగ్స్‌నూ ప్రేక్షకులు మ్యాచ్‌ను ఆస్వాదించారు. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరినీ మేం కోరుతున్నాం’ అని ధోనీ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment