
సాక్షి, హైదరాబాద్: నార్త్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆకుల శ్రీజ, సురావజ్జుల ఫిడేల్ రఫీక్ స్నేహిత్ మెరిశారు. హరియాణాలోని పంచ్‌కులాలో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీజ యూత్ బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా... పురుషుల సింగిల్స్ విభాగంలో స్నేహిత్ రన్నరప్‌గా నిలిచారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున బరిలోకి దిగిన 19 ఏళ్ల శ్రీజ ఫైనల్లో 13–15, 11–5, 12–10, 11–9, 9–11, 12–10తో సెలీనా దీప్తి (తమిళనాడు)పై గెలిచింది.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల స్నేహిత్ 9–11, 8–11, 11–4, 11–7, 6–11, 4–11తో ప్రపంచ జూనియర్ మూడో ర్యాంకర్ మానవ్ ఠక్కర్ (పీఎస్‌పీబీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో స్నేహిత్ మూడో రౌండ్‌లో ‘ట్రిపుల్ ఒలింపియన్’... 2006 కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ విజేత... ఎనిమిదిసార్లు జాతీయ చాంపియన్ అయిన 36 ఏళ్ల ఆచంట శరత్ కమల్‌పై 12–10, 9–11, 11–3, 11–9, 5–11, 12–14, 11–8తో సంచలన విజయం సాధించాడు.