‘టాప్’గా సెమీస్‌లోకి | Chennai Smashers Storm Into Semifinal | Sakshi
Sakshi News home page

‘టాప్’గా సెమీస్‌లోకి

Published Thu, Jan 14 2016 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

‘టాప్’గా సెమీస్‌లోకి

‘టాప్’గా సెమీస్‌లోకి

లీగ్ దశలో ఢిల్లీ ఏసర్స్‌కు అగ్రస్థానం
చెన్నై, వారియర్స్, ముంబై కూడా
సెమీస్‌లోకి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్

 
 బెంగళూరు: అగ్రశ్రేణి విదేశీ క్రీడాకారుల నిలకడైన ప్రదర్శన కారణంగా ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఢిల్లీ ఏసర్స్ జట్టు అగ్రస్థానాన్ని సంపాదించింది. ఆరు జట్లు పాల్గొన్న లీగ్ దశ పోటీలు బుధవారం ముగిశాయి. నిర్ణీత 25 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఢిల్లీ ఏసర్స్ 20 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఢిల్లీతోపాటు అవధ్ వారియర్స్ (లక్నో), చెన్నై స్మాషర్స్, ముంబై రాకెట్స్ జట్లు కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.
 
  బుధవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ ఏసర్స్ 5-0 పాయింట్ల తేడాతో ముంబై రాకెట్స్‌ను చిత్తు చేయగా... చెన్నై స్మాషర్స్ 4-1 పాయింట్ల తేడాతో బెంగళూరు టాప్‌గన్స్‌పై గెలిచింది. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు టాప్‌గన్స్ జట్లు లీగ్ దశలోనే నిష్ర్కమించాయి.
 
 మిక్స్‌డ్ డబుల్స్ తొలి మ్యాచ్‌లో అక్షయ్ దేవాల్కర్-అపర్ణ బాలన్ (ఢిల్లీ) జంట 13-15, 11-15తో కామిల్లా జుల్-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జోడీ చేతిలో ఓడిపోయి 0-1తో వెనుకబడింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్ ‘ట్రంప్ మ్యాచ్’లో పీసీ తులసీ 15-11, 8-15, 15-13తో గద్దె రుత్విక శివాని (ముంబై)పై గెలిచింది. ముంబై పేర్కొన్న ట్రంప్ మ్యాచ్‌లో ఢిల్లీ నెగ్గడంతో ఆ జట్టు ఖాతాలో ఒక పాయింట్ చేరగా... ముంబై ఒక పాయింట్‌ను చేజార్చుకుంది.
 
  దాంతో ఢిల్లీ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో ఇండోనేసియా స్టార్ ప్లేయర్ టామీ సుగియార్తో 15-8, 15-6తో హెచ్‌ఎస్ ప్రణయ్ (ముంబై)ను ఓడించడంతో ఢిల్లీ ఆధిక్యం 2-0కు పెరిగింది. పురుషుల డబుల్స్‌లో కూ కీట్ కీన్-తాన్ బూన్ హెంగ్ ద్వయం 11-15, 15-12, 15-10తో మథియాస్ బో-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జంటపై నెగ్గడంతో ఢిల్లీ 3-0తో ముందంజ వేసింది. ఇక తాము ఎంచుకున్న పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు రాజీవ్ ఉసెఫ్ 15-7, 15-10తో గురుసాయిదత్ (ముంబై)పై గెలుపొందడంతో ఢిల్లీ 5-0తో భారీ విజయాన్ని దక్కించుకుంది.
 
 సింధు అజేయం
 బెంగళూరు టాప్‌గన్స్‌తో జరిగిన పోటీలో పురుషుల సింగిల్స్ ‘ట్రంప్ మ్యాచ్’లో సోనీ ద్వి కున్‌కురో 15-10, 10-15, 15-8తో సమీర్ వర్మను ఓడించి చెన్నై స్మాషర్స్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. పురుషుల డబుల్స్‌లో హూన్ థియెన్ హౌ-నీల్సన్ ద్వయం 15-7, 15-8తో క్రిస్ అడ్‌కాక్-ప్రణవ్ చోప్రా (చెన్నై) జంటపై నెగ్గింది. ఆ తర్వాత పురుషుల రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 15-4, 15-12తో బ్రైస్ లెవెర్‌డెజ్‌పై గెలుపొందడంతో బెంగళూరు 2-2తో స్కోరును సమం చేసింది.
 
 అయితే మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 15-12, 15-7తో ది సుయోపై నెగ్గడంతో చెన్నై స్మాషర్స్ 3-2తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ లీగ్‌లో సింధు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలువడం విశేషం. బెంగళూరు టాప్‌గన్స్ ఎంచుకున్న మిక్స్‌డ్ డబుల్స్ ‘ట్రంప్ మ్యాచ్’లో క్రిస్ అడ్‌కాక్-పియా జెబాదియా ద్వయం 15-14, 15-12తో అశ్విని పొన్నప్ప-నీల్సన్ (బెంగళూరు) జంటపై నెగ్గడంతో చెన్నై స్మాషర్స్ 4-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది.

 
 నేటి తొలి సెమీఫైనల్
 ఢిల్లీ ఏసర్స్ ్ఠ చెన్నై స్మాషర్స్
 రాత్రి గం. 7.00 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం
 
 
 రెండో సెమీఫైనల్ (శుక్రవారం)
 అవధ్ వారియర్స్ ్ఠ ముంబై రాకెట్స్
 రాత్రి గం. 7.00 నుంచి హైదరాబాద్‌లో

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement