
చతేశ్వర పుజారా
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా నయావాల్ చతేశ్వర పుజారా మళ్లీ ఇంగ్లండ్ బాట పట్టనున్నాడు. వరుసగా రెండో సారి ఐపీఎల్ వేలంలోనూ పుజారాకు నిరాశే ఎదురైంది. ఏ ఫ్రాంచైజీ ఈ టెస్ట్‌బ్యాట్స్‌మన్‌ను తీసుకోకపోవడంతో మళ్లీ యార్క్‌షైర్ జట్టు తరుపున కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఆగస్టులో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కౌంటీలు మేలు చేస్తాయని పూజారా భావిస్తున్నాడు. ఇక యార్క్‌షైర్ జట్టు సైతం తమ వెబ్‌సైట్‌లో ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో పుజారా కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం ఉందని పేర్కొంది.
కౌంటీ క్రికెట్ ఆడటంపై పుజారా సైతం ఆనందం వ్యక్తం చేశాడు. ‘మళ్లీ యార్క్‌షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. యార్క్‌షైర్ ఆటగాళ్లకు ఆట పట్ల ఉన్న నిబద్ధత నాకు చాల ఇష్టం. నేను నా సహజమైన ఆట ఆడటానికే ప్రయత్నిస్తూ క్లబ్ తరుపున అత్యధిక పరుగులు చేస్తాను. యువరాజ్, సచిన్‌లా నేను కౌంటీ ఆడటం గౌరవంగా భావిస్తున్నా. కౌంటీ ఆడిన ప్రతిసారి నా ఆట మెరుగవుతుంది. నా అనుభావాన్నంతా ఉపయోగించి సాధ్యమైనన్ని పరుగులు చేస్తాను’ అని పుజారా తెలిపాడు.