సెయింట్ జార్జెస్ (గ్రెనడా): తొలి వన్డేలో 12 భారీ సిక్సర్లతో సెంచరీ... సరిగ్గా వారం తిరిగే సరికి ఈ సారి 14 సిక్సర్లతో మరో భారీ శతకం... ‘యూనివర్స్ బాస్’గా తనను తాను చెప్పుకునే క్రిస్ గేల్ తనేంటో నిరూపిస్తూ మళ్లీ విధ్వంసం సృష్టించాడు. గేల్ (97 బంతుల్లో 162; 11 ఫోర్లు, 14 సిక్సర్లు) ధాటికి నాలుగో వన్డేలో వెస్టిండీస్ విజయానికి చేరువగా వచ్చినా, చివరకు ఇంగ్లండ్ 29 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. 419 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 48 ఓవర్లలో 389 పరుగులకు ఆలౌటైంది.
గేల్‌కు తోడుగా డారెన్ బ్రేవో (59 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కార్లోస్ బ్రాత్‌వైట్ (36 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలు చేసినా లాభం లేకపోయింది. గెలుపు కోసం విండీస్ చివరి 3 ఓవర్లలో 32 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో 4 వికెట్లు ఉన్నాయి... అయితే 48వ ఓవర్ వేసిన లెగ్‌స్పిన్నర్ ఆదిల్ రషీద్ (5/85) ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ ఆట ముగించాడు. అంతకు ముందు ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 418 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (77 బంతుల్లో 150; 13 ఫోర్లు, 12 సిక్సర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (88 బంతుల్లో 103; 8 ఫోర్లు, 6సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు.
►వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న 14వ ఆటగాడిగా క్రిస్ గేల్ నిలిచాడు. బ్రియాన్ లారా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో విండీస్ క్రికెటర్ గేల్.
►వన్డేల్లో 300 సిక్సర్లను పూర్తి చేసుకున్న గేల్...ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment