నేడే క్లీన్‌స్వీప్‌ | Clean Sweep For India Against South Africa | Sakshi
Sakshi News home page

నేడే క్లీన్‌స్వీప్‌

Published Tue, Oct 22 2019 3:19 AM | Last Updated on Tue, Oct 22 2019 10:37 AM

Clean Sweep For India Against South Africa - Sakshi

ఈ టెస్టుకు ఇంకా రెండు రోజుల ఆట ఉంది. కానీ... చరిత్రకెక్కేందుకు లాంఛనమే మిగిలుంది. సఫారీపై ఎప్పుడూలేని విధంగా 3–0తో క్లీన్‌స్వీప్‌ విజయానికి టీమిండియా రెండే అడుగుల దూరంలో ఉంది. టెస్టుల్లో నంబర్‌వన్‌ కోహ్లి బృందం తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను రోజంతా దడదడలాడించింది. మూడో టెస్టులో ఒక్క మూడో రోజే 16 వికెట్లతో ఘనచరితకు శ్రీకారం చుట్టింది.

రాంచీ: భారత పేసర్లు షమీ, ఉమేశ్‌లు ఆఖరి టెస్టును మూడో రోజే తేల్చేశారు. ఇద్దరు సీమర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదేసి వికెట్లు పడేశారు. చారిత్రక విజయానికి భారత్‌ను దగ్గర చేశారు. క్లీన్‌స్వీప్‌కు రెండే వికెట్ల దూరంలో నిలిపారు. ఆ లాంఛనం తొలి ఘడియలోనే పూర్తయితే కోహ్లి సేన ఎదురులేని విజయాన్ని సాధిస్తుంది. తొలి సెషన్‌లో పేసర్లు ఉమేశ్‌ (3/40), షమీ (2/22)లకు స్పిన్నర్లు జడేజా (2/19), నదీమ్‌ (2/22) తోడయ్యారు. దీంతో సఫారీ తొలి ఇన్నింగ్స్‌ 56.2 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. హమ్జా  (79 బంతుల్లో 62; 10 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. భారత పేసర్లు ఫాలోఆన్‌లో మరింత రెచ్చిపోయారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను నిలువునా కూల్చేశారు. ఆటనిలిచే సమయానికి 132 పరుగులకే 8 వికెట్లను పడేశారు. 10 పరుగులే ఇచి్చన షమీ 3 వికెట్లు తీయగా, ఉమేశ్‌ 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు.

ఆడింది... హమ్జా ఒక్కడే!
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ హమ్జా ఒక్కడే భారత బౌలర్లకు ఎదురునిలిచాడు. 9/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సఫారీ జట్టు ఆరంభ ఓవర్లోనే కెపె్టన్‌ డు ప్లెసిస్‌ (1) వికెట్‌ను కోల్పోయింది. అతన్ని ఉమేశ్‌ బౌల్డ్‌ చేశాడు. హమ్జాకు బవుమా (72 బంతుల్లో 32; 5 ఫోర్లు) జతయ్యాడు. ఇద్దరు కలిసి భారత బౌలర్లను 21 ఓవర్ల పాటు ఆడుకున్నారు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక సఫారీ కష్టాలు మొదలయ్యాయి. వన్డేను తలపించే ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న హమ్జాను జడేజా బోల్తా కొట్టించగా... బవుమాను నదీమ్‌ ఔట్‌ చేశాడు.

129/6 స్కోరు వద్ద సఫారీ లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్‌లో లిండే (81 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టెయిలెండర్లతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. పీట్‌ (4), రబడ (0) స్వల్ప వ్యవధిలోనే ని్రష్కమించినప్పటికీ... తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నోర్జే (55 బంతుల్లో 4) ఆకట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌ను చాలాసేపు ఎదుర్కొన్నాడు. 45వ ఓవర్లో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. ఆ తర్వాత కాసేపటికే లిండేను ఉమేశ్, నోర్జేను నదీమ్‌ ఔట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 162 పరుగుల వద్ద ముగిసింది.

తప్పని తడబాటు... 
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో సఫారీకి ఫాలోఆన్‌ తప్పలేదు. అయితే వారి రెండో ఇన్నింగ్స్‌ కూడా కష్టాలతోనే మొదలైంది. రిటైర్డ్‌హర్ట్‌ ఎల్గర్‌ (16) మినహా తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ అంతా 5 పరుగుల్లోపే పెవిలియన్‌ చేరారు. డికాక్‌ (5)ను ఉమేశ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకున్న హమ్జా (0)కు షమీ ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. ఇదే ఊపులో కెప్టెన్‌ డుప్లెసిస్‌ (4)ను షమీ ఎల్బీ చేశాడు. మొత్తానికి మూడో సెషన్‌కు ముందే సఫారీ 4 కీలక వికెట్లను కోల్పోయింది. టీ బ్రేక్‌ తర్వాత కూడా పర్యాటక జట్టు పరిస్థితిలో ఏ మార్పూ లేదు. లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ లిండే (27), పీట్‌ (23) నిలబడటంతో జట్టుస్కోరు వందకు చేరింది. ఎల్గర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రుయిన్‌ (30 బ్యాటింగ్‌) అజేయంగా నిలిచాడు.  సఫారీ ఇన్నింగ్స్‌లో రెండే వికెట్లు ఉండటంతో మరో అరగంటసేపు ఆటను పొడిగించారు. కానీ బ్రుయిన్‌.. నోర్జే (5 బ్యాటింగ్‌)తో కలిసి నాటౌట్‌గా నిలవడంతో ఆట మరో రోజు కొనసాగనుంది.

5..ఒకే రోజు ఆటలో 14 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం భారత్‌కిది ఐదోసారి. ఈ జాబితాలో 20 వికెట్లు (అఫ్గానిస్తాన్‌పై బెంగళూరులో; 2018) తొలి స్థానంలో ఉండగా... తర్వాతి స్థానాల్లో 17 వికెట్లు (పాకిస్తాన్‌పై ఢిల్లీలో; 1952–53), 16 వికెట్లు (దక్షిణాఫ్రికాపై రాంచీలో; 2019లో), 15 వికెట్లు (శ్రీలంకపై బెంగళూరులో; 1993–94లో), 14 వికెట్లు (వెస్టిండీస్‌పై రాజ్‌కోట్‌లో 2018–19లో) ఉన్నాయి.

►8.. ప్రత్యర్థి జట్టును ఎక్కువసార్లు ఫాలోఆన్‌ ఆడించిన భారత కెపె్టన్‌గా విరాట్‌ కోహ్లి గుర్తింపు పొందాడు. కోహ్లి సారథ్యంలో ఇప్పటివరకు భారత్‌ ప్రత్యర్థి జట్టును 8 సార్లు ఫాలోఆన్‌ ఆడించింది. తర్వాతి స్థానాల్లో అజహరుద్దీన్‌ (7), ధోని (5), సౌరవ్‌ గంగూలీ (4) ఉన్నారు. 

►2.. ఒక సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు రెండుసార్లు ఫాలోఆన్‌ ఆడటం 1964–65 తర్వాత ఇదే తొలిసారి. స్వదేశంలో 1964–65లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా చివరిసారి రెండుసార్లు ఫాలోఆన్‌ ఆడింది. 

►4.. టెస్టుల్లో స్టంపింగ్‌ ద్వారా కెరీర్‌లో తొలి వికెట్‌ తీసిన నాలుగో బౌలర్‌గా షాబాజ్‌ నదీమ్‌ గుర్తింపు పొందాడు. గతంలో డబ్ల్యూవీ రామన్‌ (వాల్‌‡్ష–1987–88లో), ఎం.వెంకటరమణ (హేన్స్‌–1988–89లో), ఆశిష్‌ కపూర్‌ (కార్ల్‌ హూపర్‌–1994–95లో) ఈ ఘనత సాధించారు. 

►2.. కొట్నీ వాల్ష్‌ (వెస్టిండీస్‌) తర్వాత భారత గడ్డపై వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉమేశ్‌ యాదవ్‌ (6/88, 4/45, 3/37, 3/22, 3/40) గుర్తింపు పొందాడు.

ఉమేశ్‌ బౌన్సర్‌... ఎల్గర్‌ కన్‌కషన్‌ 
భారత సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ బౌన్సర్‌ సఫారీ ఓపెనర్‌ ఎల్గర్‌ను పడేసింది. అతను వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఎల్గర్‌ 16 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా... ఉమేశ్‌ వేసిన మూడో బంతి అనూహ్యంగా బౌన్స్‌ అయి బ్యాట్స్‌మన్‌ చెవి పైభాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను పడిపోయాడు. బ్యాటింగ్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో ఐసీసీ కన్‌కషన్‌ ప్రొటోకాల్‌ ప్రకారం మ్యాచ్‌ రిఫరీ ఎల్గర్‌ స్థానంలో బ్రుయిన్‌ను ఆడించేందుకు అనుమతించారు. ఎల్గర్‌ గాయం నుంచి కోలుకోవడానికి మరో ఆరు రోజల సమయం పడుతుందని దక్షిణాఫ్రికా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది.

సాహా స్థానంలో పంత్‌ కీపింగ్‌
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ. వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయంతో మైదానం వీడాడు. మూడో రోజు ఆటలో అశ్విన్‌ వేసిన 27వ ఓవర్‌ తొలి బంతి గింగిర్లు తిరుగుతూ బౌన్స్‌ అయింది. క్రీజులో ఉన్న లిండే దాన్ని ఎదుర్కోలేకపోవడంతో బంతిని సాహా అందుకునే ప్రయత్నం చేయగా అతని మునివేళ్లను తాకడంతో గాయపడ్డాడు. నొప్పికి తాళలేకపోయిన సాహా పెవిలియన్‌ చేరగా అతని స్థానంలో రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ చేయాల్సి వచ్చింది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 497/9 డిక్లేర్డ్‌; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి) సాహా (బి) షమీ 0; డికాక్‌ (సి) సాహా (బి) ఉమేశ్‌ 4; హమ్జా (బి) జడేజా 62; డు ప్లెసిస్‌ (బి) ఉమేశ్‌ 1; బవుమా (స్టంప్డ్‌) సాహా (బి) నదీమ్‌ 32; క్లాసెన్‌ (బి) జడేజా 6; లిండే (సి) రోహిత్‌ (బి) ఉమేశ్‌ 37; పీట్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 4; రబడ రనౌట్‌ 0; నోర్జే (ఎల్బీడబ్ల్యూ) (బి) నదీమ్‌ 4; ఇన్‌గిడి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (56.2 ఓవర్లలో ఆలౌట్‌) 162. 
వికెట్ల పతనం: 1–4, 2–8, 3–16, 4–107, 5–107, 6–119, 7–129, 8–130, 9–162, 10–162. బౌలింగ్‌: షమీ 10–4–22–2, ఉమేశ్‌ 9–1–40–3, నదీమ్‌ 11.2–4–22–2, జడేజా 14–3–19–2, అశ్విన్‌ 12–1–48–0. 
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) ఉమేశ్‌ 5; ఎల్గర్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 16; హమ్జా (బి) షమీ 0; డు ప్లెసిస్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 4; బవుమా (సి) సాహా (బి) షమీ 0; క్లాసెన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమేశ్‌ 5; లిండే (రనౌట్‌) 27; పీట్‌ (బి) జడేజా 23; బ్రుయిన్‌ (బ్యాటింగ్‌) 30; రబడ (సి) జడేజా (బి) అశ్విన్‌ 12; నోర్జే (బ్యాటింగ్‌) 5; ఎక్స్‌ట్రాలు 5; 
మొత్తం (46 ఓవర్లలో 8 వికెట్లకు) 132. 
వికెట్ల పతనం: 1–5, 2–10, 3–18, 4–26, 5–36, 6–67, 7–98, 8–121. బౌలింగ్‌: షమీ 9–5–10–3, ఉమేశ్‌ 9–1–35–2, జడేజా 13–5–36–1, నదీమ్‌ 5–0–18–0, అశి్వన్‌ 10–3–28–1.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement