
అంతా ఐపీఎల్ చలవే: అశీష్ నెహ్రా
టీమిండియా పేస్ బౌలర్ అశీష్ నెహ్రా సంచలనవ్యాఖ్యలు చేశాడు.
కోల్ కతా: టీమిండియా పేస్ బౌలర్ అశీష్ నెహ్రా సంచలనవ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి మళ్లీ తాను చేరానంటే అంతా ఐపీఎల్ చలవే అన్నాడు. తొలిసారి భారత జట్టులోకి వచ్చినప్పటి కంటే కొన్ని నెలలు జట్టులో చోటు కోల్పోయి మళ్లీ జట్టులోకి ఎంపిక కావడం చాలా కష్టంతో కూడుకున్న పని అని నెహ్రా అభిప్రాయపడ్డాడు. 2011 సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. ఆ తర్వాత గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీలో భారత జట్టుకి మరోసారి ఎంపికయ్యాడు ఈ సీనియర్ పేసర్. 36 ఏళ్ల తర్వాత జట్టులో మళ్లీ స్థానం సంపాదించడం ఏ ఆటగాడికైనా చాలా విపత్కర పరిస్థితి అని అది తనకు సాధ్యమైందని చెప్పాడు.
ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ బయలుదేరే ముందు నెహ్రా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను, తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించాడు. ఎప్పుడూ స్థిరంగా రాణించడం ఆటగాళ్లకు అసాధ్యమని, అందులో ముఖ్యంగా పేస్ బౌలర్లకు ఇది చాలా కష్టంతో కూడుకున్నదని చెప్పుకొచ్చాడు. యువ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా ఆటతీరును ప్రశంసించాడు. టీమ్ లో సీనియర్, జూనియర్ అనే తేడాలుండవు. ప్రతి ఒక్కరూ జట్టు విజయం కోసమే పోరాడుతారన్నాడు.