
'సాక్షి మాలిక్ చరిత్ర సృష్టించింది'
:రియో ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందలు తెలియజేశారు.
న్యూఢిల్లీ:రియో ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందలు తెలియజేశారు. ఒలింపిక్స్ లో సాక్షి ఒక కొత్త చరిత్రను నమోదు చేసిందంటూ ప్రశంసించారు. ఇది యావత్ భారతావని గర్వించదగ్గ అతి పెద్ద విజయమని మోదీ కొనియాడారు. 'సాక్షి మాలిక్ చరిత్ర సృష్టించింది. కాంస్య పతకం సాధించిన సాక్షికి అభినందనలు. రక్షా బంధన్ రోజున పతకం సాధించిన సాక్షి భారతజాతి ముద్దుబిడ్డ. ఆమె సాధించిన పతకం జాతి గౌరవాన్ని మరింత ఉన్నతస్థానాలకు తీసుకెళ్లింది'అని మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు.
మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై గెలిచింది. అంతకుముందు ‘రెప్‌చేజ్’ బౌట్‌లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్‌దోర్జ్ (మంగోలియా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. అయితే సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లర్ వలెరియా కొబ్లోవా ఫైనల్‌కు చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు ‘రెప్‌చేజ్’లో పోటీపడే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న సాక్షి.. భారత్ అభిమానుల పతక నిరీక్షణకు తెరదించింది. ఏ మాత్రం తడబాటు లేకుండా విజయ బావుటా ఎగురేసి బ్రెజిల్ వీధుల్లో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించింది.
సాక్షి మాలిక్కు భారీ నజరానా
రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్కు హరియాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. సాక్షి పతకం సాధించిన కొద్ది గంటల్లోనే ఆమెకు రూ. 2 50 కోట్ల రివార్డును అందజేయనున్నట్లు తెలిపింది. దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సాక్షికి ఇవ్వనున్నట్లు హరియాణా ప్రభుత్వ ఓ ప్రకటనలో పేర్కొంది.