![Coronavirus Has Entered The Family of BCCI president Gangulys Family - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/20/ganguly.jpg.webp?itok=rdsKEsju)
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఇంట మరోసారి కరోనా కలకలం రేపింది. గంగూలీ అన్నయ్య, వారి కుటుంబసభ్యులైన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి స్నేహాశిష్ భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు అక్కడి వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటికే స్నేహశిష్ అత్తామామలకు, వారి ఇంట్లో పనిచేసే వ్యక్తి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే దాదా కుటుంబంలో కరోనా కేసులు పెరుగుతుండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. (‘అది గంగూలీకి గుర్తుందో లేదో’)
‘కొన్ని రోజులుగా అస్వస్థతకు లోనవ్వడం, కరోనా లక్షణాలు కనిపించడంతో నలుగురు గంగూలీ కుటుంబీకులకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం వీరు ఓ ప్రయివేట్ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే వీరు గంగూలీ కుటుంబీకులే కానీ ఒకే ఇంట్లో ఉంటున్న వారు కాదు. ప్రస్తుతం కరోనా సోకిన ఈ నలుగురి ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తుల వివరాల గురించి తెలుసుకుంటున్నాం’ అని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఈ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించేందుకు దాదా ప్రయత్నాలు కొనసాగిస్తుంటే ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటం భారత క్రికెట్ వర్గాలను కలవరానికి గురిచేస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 13,090 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 529 మంది కరోనాతో మృతి చెందారు. (‘సచిన్ కంటే దాదానే ధైర్యవంతుడు’)
Comments
Please login to add a commentAdd a comment