సచిన్ ను తీసేయడానికి సిద్ధమయ్యాం!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ సేవలందించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు చెప్పడానికి ముందే అతని ఉద్వాసనకు రంగం సిద్ధమైందట. 2012లో భారత వన్డే జట్టు నుంచి సచిన్ను తొలగించడానికి సిద్ధమైనట్లు మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వెల్లడించాడు. ఓ మరాఠీ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో సచిన్ తొలగింపుపై సందీప్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '
2012, డిసెంబర్ 12 వ తేదీన సచిన్ భవిష్యత్తు కార్యచరణపై అడిగాం. అయితే రిటైర్మెంట్ ఆలోచన లేదని సచిన్ చెప్పాడు.ఆ సమయంలో సచిన్ నిర్ణయాన్ని గౌరవించిన సెలక్షన్ కమిటీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు ఆ తరువాత జరిగిన మరో సమావేశంలో సచిన్ తన రిటైర్మెంట్పై నిర్ణయాన్నిమాకు తెలిపాడు. అప్పుడు సచిన్ కనుక రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోనట్లయితే, అతన్ని కచ్చితంగా వన్డే జట్టు నుంచి తొలగించే వాళ్లం'అని పాటిల్ పేర్కొన్నాడు.
తన నాలుగేళ్ల పదవీ కాలంలో అతి పెద్ద సవాల్ ఎదైనా ఉందంటే అది సచిన్ రిటైర్మెంట్ నిర్ణయమేనని సందీప్ పాటిల్ తెలిపాడు. 2013 నవంబర్ నెలలో వెస్టిండీస్తో ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా సచిన్ తన అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే 2012 మార్చిలో ఢాకాలో పాకిస్తాన్తో సచిన్ చివరి వన్డే ఆడేశాడు.