
ఆ సంచలన గోల్ సీక్రెట్ ఇదే!
యూరో కప్ లో వేల్స్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో పోర్చుగల్ స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో కొట్టిన హెడర్ (గోల్) గుర్తుందా!
► హైపోక్సిక్ చాంబర్లో సాధన
► రొనాల్డో బాటలో యోగేశ్వర్
న్యూఢిల్లీ: యూరో కప్ లో వేల్స్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో పోర్చుగల్ స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో కొట్టిన హెడర్ (గోల్) గుర్తుందా! వాయు వేగంతో దూసుకొచ్చిన బంతిని 8 అడుగుల ఏడు అంగుళాలు పైకి ఎగిరి తలతో గోల్ పోస్ట్ లోకి పంపాడు. మామూలుగా ఇలాంటి సంఘటనల్లో బంతి తగలడమే గొప్ప. కానీ అంత ఎత్తుకు ఎగిరి... అంత బలంగా కొట్టాడంటే...! చూడటానికి ఇది సహజంగా కనిపించినా.. దీని వెనుక ఉన్న మంత్ర దండం మాత్రం ‘హైపోక్సిక్ చాంబర్’. మామూలుగా ఓ చిరుత పరుగు తీయడానికి కూడగట్టుకునే శక్తికి ఐదు రెట్లు ఎక్కువగా రొనాల్డో ఈ షాట్ కోసం ఉపయోగించాడు. అంతేకాదు ఆ షాట్ కొట్టడానికి అతను 0.8 సెకన్లు గాల్లో వేలాడాడు.
అసలు ఇది ఎలా సాధ్యమంటే..!
మాడ్రిడ్ లోని తన ఇంట్లో ఉండే ఈ హైపోక్సిక్ చాంబర్లో రొనాల్డో ప్రతి రోజూ చేసే కసరత్తులే కారణమట. దీనివల్ల ఫిట్నెస్, శరీరంలోని శక్తి, సహనం గణనీయంగా మెరుగుపడటం, గాయాల నుంచి తొందరగా కోలుకోవడం జరుగుతుంది. అలాగే రక్తంలోని ఆక్సిజన్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంటే గాల్లో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నా శరీరంలోని కార్డియో రెస్పిరేటరి వ్యవస్థ అత్యంత మెరుగ్గా కండరాలకు శక్తిని అందిస్తుంది. ఫలితంగా అథ్లెట్కు అలసట పెద్దగా తెలియదు. దీంతో ప్రదర్శన అమోఘంగా మెరుగుపడుతుంది.
సీన్ కట్ చేస్తే రియో ఒలింపిక్స్ నేపథ్యంలో భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా ఇప్పుడు ఈ చాంబర్లోనే శిక్షణ మొదలుపెట్టాడు. సోనెపట్లోని సాయ్ సెంటర్లో జూన్ 28న ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయించుకున్నాడు. సముద్ర మట్టానికి 3100 మీటర్ల ఎత్తులో వాతావరణం ఎలా ఉంటుందో ఈ చాంబర్లో అలా ఉంటుంది. ఇప్పుడు మన రెజ్లర్ రోజుకు ఓ గంట అందులో ఎక్సర్ సైజ్ చేస్తున్నాడు.
హైపోక్సిక్ చాంబర్ ఇలా ఉంటుంది...
మామూలుగా ఓ జిమ్ లోకి గాలి చొరబడకుండా చేస్తే ఎలా ఉంటుందో ఈ హైపోక్సిక్ చాంబర్ అలాగే ఉంటుంది. ఇందులో ఉత్పత్తి అయ్యే ఆవిరి వలన ఎత్తైన వాతావారణంలో ఉన్నట్లు ఉంటుంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయి క్రమంగా తగ్గుతుండటం అథ్లెట్ కార్డియో రెస్పిరేటరి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అప్పుడు ఈ వ్యవస్థ అందుబాటులో ఉండే ఆక్సిజన్ను చాలా సమర్థంగా వినియోగించుకుంటుంది. తక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల ఫిట్నెస్, శక్తి, ఓర్పు, దీనివల్ల అథ్లెట్ ఫిట్ నెస్, సామర్థ్యం గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్లు గాట్లిన్, ఉసెన్ బోల్ట్, టైసన్ గే, బాక్సింగ్ ఛాంపియన్లు మేవెదర్, పకియానో ఈ చాంబర్లోనే తమ కసరత్తులు చేస్తారు.