
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగుసార్లు గెలిచి నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఐపీఎల్-11లో లీగ్ దశలో సన్‌రైజర్స్‌పై రెండుసార్లు విజయం సాధించిన ధోని అండ్ గ్యాంగ్.. ఆ తర్వాత క్వాలిఫయర్-1, ఫైనల్ మ్యాచ్‌ల్లో సైతం విజయ ఢంకా మోగించింది. ఫలితంగా ఒక సీజన్‌లో ఒక జట్టుపై అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన తొలి జట్టుగా సీఎస్‌కే చరిత్ర సృష్టించింది. అదే సమయంలో సన్‌రైజర్స్ ఒక సీజన్‌లో ఒక జట్టుపై అత్యధిక సార్లు ఓటమి పాలైన అపప‍్రథను మూటగట్టుకుంది.
ఆదివారం సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో చెన్నై 8 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సీఎస్‌కే విజయంలో షేన్ వాట‍్సన్(117;57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ముఖ్య భూమిక పోషించాడు.